నమస్తే తెలంగాణ, ఆగస్టు 23 : యూరియా కోసం అన్నదాతలు నరకయాతన పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలి కంటిమీద కనుకు లేకుండా గడుపుతున్నారు. అదను దాటితే పంట అక్కరకు రాదని ఎరువు కోసం ఆరాటపడుతున్నారు. సద్దులు కట్టుకొని కుటుంబాలతో సహా వెళ్లి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా వస్తుందన్న సమాచారం తెలిస్తే చాలు అపరాత్రైనా వెళ్లి లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని కొన్నిచోట్ల, సరిపడా ఇవ్వడం లేదని మరికొన్ని చోట్ల రైతులు ఆందోళనలు చేశారు. సర్కారుకు కండ్లు లేవా..?, మా తిప్పలు కనిపించడం లేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ వద్ద శనివారం పర్వతగిరి, రెడ్యాల, జంగిలికొండ, మల్యాల రైతులు శనివారం బారులు తీరారు. వ్యవసాయ అధికారులు ఒక లోడ్ మాత్రమే వచ్చిందని చెప్పి మూడు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా బస్తాలు అందజేశారు. మిగిలిన టోకెన్లకు సోమవారం లేదా మంగళవారం లారీ లోడ్ వచ్చాకే ఇస్తామని వ్యవసాయ అధికారులు తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్సింహులపేట మండలంలో పది రోజులుగా రైతులు యూరియా కోసం పనులు మానుకొని సొసైటీ గోదాము, ఫర్టిలైజర్ షాపుల వద్ద నిరీక్షిస్తున్నారు. తీరా అధికారులు, పోలీసులు వచ్చి ఒక్కో రైతుకు బస్తా చొప్పున ఇవ్వడంతో ఏం సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కురవి మండలం నేరడ సొసైటీ గోదాము వద్ద వ్యవసాయ పనులు వదులుకొని రైతులు యూరియా పడిగాపులుగాచారు.
222 బస్తాల యూరియా రాగా ఒకరికి ఒకే బస్తా చొప్పున పోలీసుల పహారాలో పంపిణీ చేశారు. మరిపెడ సొసైటీకి 763 బస్తాల యూరియా రాగా పోలీసు బందోబస్తు నడుమ మూడు గంటల్లోనే పంపిణీ చేశారు. సరిపడా యూరియా రాకపోవడంతో వందలాది మంది నిరాశతో వెళ్లిపోయారు. యూరియా లోడ్ వస్తుందని తెలిసి కొత్తగూడ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయానికి వందలాది మంది రైతులు తరలివచ్చి గంటల తరబడి నిరీక్షించారు. స్టాక్ రాకపోవడంతో ఆవేదనతో వెళ్లిపోయారు. డోర్నకల్ మండలంలోని గొల్లచర్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు. పోలీస్ బందోబస్తు నడుమ రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
చిన్నగూడూరు మండలం జయ్యారం రైతువేదికలో ఉదయం నుంచి లైన్లో నిలబడి కూపన్ తీసుకున్న రైతులు పీఏసీఎస్ ఎరువుల దుకాణం వద్దకు పరిగెత్తుకొని వెళ్లారు. అక్కడ ఈ-పాస్ యంత్రం మొరాయించడంతో మధ్యాహ్నం వరకు ఇబ్బందిపడ్డారు. గూడూరు మండలకేంద్రంలోని పీఏసీఎస్‌కు శనివారం 600 బస్తాల యూరియా రాగా, 400 బస్తాలే పంపిణీ చేశారు. మిగిలిన 200 బస్తాలు ఎటువెళ్లాయని, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారా..? అంటూ పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. అధికారులు ఎంతకూ స్పందించకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆగ్రహంతో ఒక్కసారిగా గేట్‌ను బలంగా తోసేసి, కార్యాలయ ఆవరణలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఐ సూర్యప్రకాశ్ వెంటనే గేట్ వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ నాగభవాని, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఏవో అబ్దుల్మాలిక్, పీఏసీఏఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డిని రైతుల వద్దకు తీసుకొచ్చి వివరణ ఇప్పించారు. గతంలో కొంతమంది రైతులకు టోకెన్లు ఇచ్చామని, ప్రాధాన్యతాప్రకారం వారికి ముందు యూరియా బస్తాలను అందించాల్సి వచ్చిందని చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం ఏవో అబ్దుల్మాలిక్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడి మరో 220 బస్తాలు శనివారం మధ్యాహ్నం వరకు తెప్పించి రైతులకు అందజేశారు. కాగా, ఊట్ల గ్రామానికి చెందిన సృజన (మానసిక దివ్యంగురాలు)తన అమ్మమ్మ సులోచన, మేనత్త కవితతో యూరియా కోసం పీఏసీఎస్‌కు రావడం అక్కడున్న వారిని కలిచివేసింది.
అయితే, కొంతమంది రైతులకు యూరియా అందకపోవడంతో అక్కడే ఉన్న ఏవోను తమకు యూరియా బస్తాలు ఇప్పించాలని, కనీసం టోకెన్లు అయినా ఇవ్వాలని ఏవో అబ్దుల్మాలిక్ను ఘోరావ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏవోను పీఏసీఎస్ కార్యాలయం నుంచి బయటికి తీసుకొచ్చి పోలీసు వాహనంలో పంపించారు. కాగా, ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద శనివారం వందలాది మంది రైతులు యూరియా కోసం బారులు తీరారు. 444 బస్తాల యూరియా రాగా ఆధార్‌కార్డు లింకుతో రెండు బస్తాల చొప్పున అందించారు. 200 మంది రైతులు క్యూలో ఉండగా సొసైటీ అధికారులు టోకెన్లు అందించారు. సాయంత్రం 550 యూరియా బస్తాలు వస్తాయని, టోకెన్లు తీసుకున్న రైతులకు అందిస్తామని వారు తెలిపారు.