రైతన్నల కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల సాగునీరందక ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం, యాసంగి వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షలు నిర్వహిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 2న కలెక్టర్లకు వినతిపత్రాలు అందించగా, తాజాగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు తెలుపనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేయగా రైతుల కోసం తలపెట్టే ఈ నిరసనల్లో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు.
– వరంగల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేలా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపంతో యాసంగిలో పంటలకు సాగునీరు అందలేదు. వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ప్రాజెక్టుల నుంచి కాల్వలకు సాగునీటి సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరి రైతులు ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. ఎండిన పంట పోగా మిగిలిన పంటకు అయినా కనీస మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతుల దీక్షలను తలపెట్టింది.
సాగునీరు లేక యాసంగి పంటలు ఎండిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రైతుల వద్దకు వస్తున్నారు. మార్చి 31న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకొని ధైర్యమిచ్చారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోవడంతో బోర్లు వేసుకున్నామని, బోర్లు పడక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కేసీఆర్‌తో గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. యాసంగి వరి కోతలు మొదలైన నేపథ్యంలో ఇప్పటినుంచే బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 2న అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌పై నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఒత్తిడి పెంచేందుకు శనివారం రైతు దీక్షలను నిర్వహిస్తున్నది.