కరీంనగర్, నమస్తే తెలంగాణ ; కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో రైతు కూన సదానందం వరి, మక్క పంటలను రక్షించుకునేందుకు నాలుగు కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పంటలకు అందిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ ఉన్నా ట్యాంకర్ లేకపోవడంతో నెలకు రూ.10 వేలు అద్దెకు తీసుకున్నాడు. రోజుకు రూ.వెయ్యి డీజిల్ ఖర్చు చేస్తూ పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు 10 నుంచి 12 ట్రిప్పుల నీళ్లు తెచ్చి తన గాజు బావిలో పోయిస్తున్నాడు. అక్కడి నుంచి మోటర్ ద్వారా పంటలకు అందిస్తున్నాడు. ఇంత చేసినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం కుదరడం లేదని రైతు సదానందం వాపోతున్నాడు.
నీళ్లులేక నెర్రెలు వారిన పొలం

పెనుబల్లి ; ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంటలో చేతికొచ్చిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. తలాపునే చెరువు ఉన్నా ఎకో టూరిజం పేరుతో అధికారులు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికందే పరిస్థితి లేకుండాపోయింది. అధికారులకు పంటల కంటే టూరిజమే ఎక్కువైందా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.వెంటనే చెరువు నీటిని వదిలి పంటలను కాపాడాలని కోరుతున్నారు.
రూప్లాతండాలో పంట జీవాల పాలు

నర్సింహులపేట ; మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల మీదుగా ప్రవాహించే ఆకేరువాగుపై జయపురం, ముంగిముడుగు శివారులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు తెగి, వాగుల్లో చుక్క నీరు నిల్వ లేకుండాపోయింది. దీంతో యాసంగిలో పంటలకు సాగునీళ్లు అందక ఎండిపోతున్నాయి. చేసేదేమి లేక రూప్లాతండా జీపీ పరిధిలో ఓ రైతు తన వరి పొలాన్ని గొర్ల మేతకు వదిలిపెట్టాడు.