హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు దేశీయ మార్కెట్లతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను ఎగుమతులకు అనుగుణంగా పెంచుకుంటే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అపెడా, డీజీఎఫ్టీ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఎఫ్‌పీవోలు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్ర ఉత్పత్తులు మరింత పెరుగాలంటే గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ప్రమాణాలు ముఖ్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు.