కాశీబుగ్గ, అక్టోబర్ 28 : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు దక్కకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా, సోమవారం ఎనుమాముల మార్కెట్లో రూ. 6,800 పలికింది. పత్తి కొనుగోలు ధర తగ్గడంతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు మార్కెట్ కమిటీ అధికారులను నిలదీయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో క్రయ విక్రయాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. వెంటనే మార్కెట్ కార్యదర్శి పోలెపాక నిర్మల రంగంలోకి దిగి రైతులకు పత్తి ధరలు తగ్గడంపై క్లుప్తంగా వివరించారు. అనంతరం యార్డులో సీసీఐ అధికారులతో రైతులకు అవగాహన కల్పించారు.
మార్కెట్కు తీసుకువచ్చే పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటున్నదని సీసీఐ అధికారులతో పాటు కార్యదర్శి నిర్మల తెలిపారు. సీసీఐ కొనుగోలు చేయాలంటే తేమ కచ్చితంగా 8 నుంచి 12 శాతం వరకు ఉండాలని సూచించారు. ప్రస్తుతం పత్తిలో 15 నుంచి 30 శాతం వరకు ఉంటున్నదని, దీంతో పత్తి నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలు, కాటన్ బెయిల్స్కు ధర పడిపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తేమ 12 శాతం మించకుండా నాణ్యతా ప్రమాణాలతో తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. అలాగే రైతులు పత్తిని బస్తాల్లో కాకుండా వాహనాల్లో లూజుగా తీసుకొస్తే సీసీఐ కొనుగోలు చేస్తుందని అధికారులు తెలిపారు.