బయ్యారం, మార్చి 6 : పూర్తిగా ఎండాకాలం రానేలేదు.. అప్పుడే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో వేసిన వరి పొలాలకు నీళ్లందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. యాసంగికి గాను బయ్యారం పెద్దచెరువు పెద్దకాల్వ, నక్క తూము, ధర్మపురం, పెరుగుబుడ్డి, తునికి కాల్వల కింద ఉన్న 1500 ఎకరాలకు ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇర్సులాపురం సమీపంలోని ఈసం లక్ష్మయ్య బుర్ర కింద ఉన్న సుమారు వంద ఎకరాలు కూడా కేటాయించారు.
అయితే, అప్పుడే రైతులు చివరి బుర్రకు నీళ్లందవని ఇరిగేషన్ అధికారులకు తెలిపి, ఈ ఏడాది మినహాయించాలని కోరినా, వినిపించుకోని అధికారులు సరిడా నీళ్లిస్తామని చెప్పడంతో ఈసం లక్ష్మయ్య బర్రకు చెందిన 35 మంది గిరిజన రైతులు 75 ఎకరాల్లో వరినాట్లు వేశారు. వరి వేసినప్పటి నుంచి సరిగ్గా నీరందక నెర్రెలు బారి పంట ఎండిపోతున్నది. ఇరిగేషన్ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన ఆయకట్టు రైతులు శుక్రవారం పెద్దచెరువు తూముల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. నాటు వేసి నెల రోజులు కావొస్తున్నా కనీసం 5 ఎకరాల కూడా నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువులో సమృద్ధిగా నీరున్నా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో తమకు సాగు నీరందడం లేదని వాపోతున్నారు. సరిపడా నీరు ఉన్నా వదలడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటలకు నీరందించాలని కోరారు. ఈ విషయంపై ఐబీ ఏఈ అఖిలను వివరణ కోరగా.. పెద్ద కాల్వకు చివరిగా ఉన్న బుర్ర కావడంతో నీరు చేరడం ఇబ్బందిగా మారందని తెలిపారు. కొందరు రైతులు గండ్లు నీరు పెట్టుకుంటున్నట్లు గుర్తించి తొలగించామని తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, సరిపడా నీరు అందిస్తామని తెలిపారు.