తొర్రూరు, ఆగస్టు 11 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తొర్రూరు–నర్సంపేట రహదారిపై ఉన్న పిఎసిఎస్ సహకార ఎరువుల దుకాణం ముందు రైతులు భారీగా చేరి నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పోలీసుల పహారాలో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. బ్లాక్ మార్కెటింగ్ కారణంగా ప్రైవేట్ దుకాణాలు అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రెండు యూరియా బస్తాలకు రూ.532 ఉండగా, అదనంగా ఒక గుళికల బస్తాను రూ.830కి బలవంతంగా కొనిపెట్టే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. గుళికలు కొనకపోతే యూరియా బస్తాలు ఇవ్వడంలేదని రైతులు ఆరోపించారు.
యూరియా కొరతపై తొర్రూరు వ్యవసాయ అధికారి రాం నర్సయ్యను వివరణ కోరగా.. మండలంలో సరిపడా యూరియా ఉందన్నారు. ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా తమను సంప్రదిస్తే ఎరువుల సరఫరాలో ఎలాంటి లోపం రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిరసనలో మాలోత్ సురేష్, వెంకటరెడ్డి, ప్రశాంత్, వెంకన్న, ఉప్పలయ్య, భాస్కర్, ఉపేందర్, రవి, మహేష్, రాజు, ఉప్పలమ్మ, రజిత, మల్లారెడ్డి, బజేలాల్, మధుకర్, యాకూబ్, శ్రీనివాస్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.