నర్సంపేట, జూన్ 22 : తెల్లబంగారం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాణిజ్య పంటలపై ఉన్న మోజుతో అదే బాటలో పయనిస్తున్నారు. పొలాల్లో భూసారం తగ్గిపోతుందని, ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ నష్టాలను కొని తెచ్చు కుంటున్నారు. విత్తనాలు వేసిన తర్వాత ఒకటి, రెండు సార్లు కలుపు తీసి పురుగు మందులు పిచికారీ చేస్తే సరిపోతుందని, దాదాపు 20 రోజుల వరకు నీరు లేకున్నా పంట తట్టుకుంటుందని, మిగతా వాటితో పోలిస్తే మంచి దిగుబడి వస్తుందని పత్తి పంట వేసేందుకే శ్రద్ధ చూపుతున్నారు.
వాణిజ్య పంటలు పండించే రైతుల జీవితాలతో ప్రకృతి, దళారులు అంతా కలిసి చెలగాటమా డుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికొచ్చాక దానిని ఎలాగైనా అమ్ముకోవాలనుకున్న రైతుల అవసరాలను గమనించి ప్రైవేటు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నట్టేట ముంచుతున్నాయి. ఎక్కువ దిగుబడి రావాలని గంపెడాశతో వ్యవసాయాధికారుల సూచనలను పెడచెవిన పెట్టి ఇష్టమొచ్చిన రీతిలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. పండించిన పంటకు మార్కె ట్లో గిట్టుబాట ధర సైతం కల్పించకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
వరంగల్ జిల్లాలో గత సంవత్సరం వానకాలంలో 1,20,166 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేపట్టినట్లు వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతుండగా, 2025 వానకాలం 1,34,812 ఎకరాల పత్తి సాగుకు అంచనా వేశారు. ఈ యేడు పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాణిజ్య పంటలపై మోజును కొంత వరకు తగ్గించుకుంటేనే భవిష్యత్లో నిలదొ క్కుకునే పరిస్థితి కన్పిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది యూఎస్-7067, యూఎ స్-704, సాంకేత్, స్విఫ్ట్, రణధీర్, చంద్రాగోల్డ్, సదానంద్, సీసీహెచ్-369, నవనీత్, రాణా రకాలకు చెందిన 2,34,800 పత్తి విత్తన ప్యాకెట్లను అధికారులు అంటుబాటులో ఉంచారు.
పత్తి పంట సాగు సులువు కావడంతో రైతాం గం ఎక్కువ మొత్తంలో దీనిపై దృష్టి పెడుతున్నది. విత్తనాలు వేసిన తర్వాత ఒకటి, రెండు సార్లు కలుపు తీసి పురుగు మందులు పిచికారీ చేస్తే సరిపోతుందంటున్నారు. నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి ఉంటుందని, 20 రోజుల వరకు నీరు లేకు న్నా పంట ఏమాత్రం ఎండిపోదంటున్నారు. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంట మంచి దిగుబ డిని అందిస్తుందని పేర్కొంటున్నారు. భూమి స్థితిగతులను బట్టి కూడా ఈ పంటను రైతులు సాగుచేస్తున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు.