ములుగు, జూన్2(నమస్తేతెలంగాణ) : ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించి అధికారులతో మాట్లాడారు. మల్టినేషనల్ కంపెనీల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసిన కోదండరెడ్డి నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న ఆలస్యంపై ఆరా తీశారు.
విత్తనోత్పత్తి ఘటనలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర ఇప్పటి వరకు జరిగిన పురోగతిని చైర్మన్‌కు వివరించినప్పటికి లబ్ధిదారులను ఎంపిక చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జూమ్ మీటింగ్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, సీడ్స్ డైరెక్టర్ కేశవులు, రైతు కమిషన్ మెంబర్ భూమి సునిల్, సలహాదారులు రామాంజనేయులు, దొంతి నర్సింహారెడ్డి, ఎం. శ్రీనివాస్‌రెడ్డితో పాటు న్యాయవాది రామచంద్రారెడ్డి, అధికారులు హాజరయ్యారు.