ములుగు : పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు మండలంలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజాద్ పాషా మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల లోపు రుణాలన్నింటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. జిల్లాలో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, కావున పాణి నకల్ ద్వారా తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లాలో కేవలం ఆయా బ్యాంకుల పరిధిలో రైతులకు 60 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయినాయని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని లేనిచో రైతాంగం ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆయా ప్రభుత్వాలను హెచ్చరించారు. ధర్నా అనంతరం యూనియన్ బ్యాంక్ జంగాలపల్లి మేనేజర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంకిడి కృష్ణయ్య, ఆర్ బిక్షపతి, ఆవుల ఐలయ్య, ఎండీ అబ్దుల్ నబీ, తోట శాంతమ్మ, మహారాజు నారాయణ, లక్ష్మి పాల్గొన్నారు.