పంటలకు యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో వాటి కోసం పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజామునే చలిని సైతం లెక్కచేయక రైతు వేదికలు, పీఏసీఎస్‌లు, ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. తిండీతిప్పలు మాని గంటల తరబడి వేచి చూస్తూ క్యూలో తోపులాడుకుంటున్నారు. అరకొర పంపిణీ కొందరికే సరి పోతుండగా, మిగతా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మక్కజొన్న, మిర్చి వంటి పంటలకు ఎక్కువ మోతాదులో యూరియా వేయాల్సి వస్తుందని, ఒక్కో బస్తా ఇస్తే ఏం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. తమ కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
నర్సింహులపేట/ మరిపెడ/ కేసముద్రం/ నర్సంపేట/ చెన్నారావుపేట/ ధర్మసాగర్/కమలాపూర్, డిసెంబర్ 24: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. బుధవారం పీఏసీఎస్ కార్యాలయానికి 1100 బస్తాలు రావడంతో పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశా రు. కొందరికే ఎరువుల బస్తాలు అందడంతో మిగతా వారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మరిపెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి 650 యూరియా బస్తాలు రావడంతో రైతులు తెల్లవారుజామునే వచ్చి చలిలో వణుకుతూ క్యూ కట్టారు.
ఈ క్రమంలో తోపులాట జరిగి కొంత గందరగోళం జరగగా, పోలీసులు వచ్చి రైతులకు సర్దిచెప్పారు. అలాగే కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి ధన్నసరి సొసైటీ ద్వారా 444 బస్తాల యూరియా రాగా, అన్నదాతలు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు లైన్లో నిలబెట్టారు. వచ్చిన ఎరువు అందరికీ అందకపోవడంతో మళ్లీ వచ్చిన తర్వాత ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలపడంతో రైతులు వెనుదిరిగారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయగా, ఇదేం సరిపోతుందని పెదవి విరిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ పీఏసీఎస్ గోదాంకు యూరియా లారీ రావడంతో వందలాది మంది రైతులు పొద్దున్నే తర లిరాగా, ఉదయం 8.30 గంటల తర్వాత అధికారులు, సిబ్బంది గోదాం వద్దకు చేరుకొని ఒక్కొక్కరికి ఒక్కో బస్తా అందించారు.
గురిజాల గ్రామంలోని పీఏసీఎస్ గోదాం వద్ద లైన్ కట్టారు. కొందరికి మాత్రమే టోకెన్లు రాగా మిగిలిన వారంతా ఆందోళన బాట పట్టారు. ఇటుకాలపల్లి సొసైటీ గోదాంకు పెద్ద ఎత్తున రైతులు భారీగా తరలివచ్చి క్యూలో నరకయాతన పడ్డారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు కప్పుకొని టోకెన్ల కోసం వేచి ఉన్నారు. ధర్మసాగర్లో ఎరువుల కోసం అన్నదాతలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు వారిని వరుస క్రమంలో నిలబెట్టి యూరియా పంపిణీ చేశారు. కమలాపూర్‌లో రెండో రోజూ యూరియా కోసం రైతులు భారీ ఎత్తున క్యూ కట్టారు.