ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో పెడితే మా నాయకులు భయపడుతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, ఇలాంటి ఉడుత ఊపులకు తాము భయపడబోమని కేటీఆర్ చెప్పారు. బాల్క సుమన్ ఇవాళ కొత్తగా జైలుకుపోలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరు నెలలు జైల్లో ఉన్నాడని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అక్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఆదేమని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించిందని విమర్శించారు. క్యాతన్‌పల్లిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో జరిగిన అక్రమాన్ని ప్రశ్నించినందుకు బాల్క సుమన్‌ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డీ గుర్తుపెట్టుకో.. నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం కచ్చితంగా వస్తుంది’ అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.
కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి, బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 22 చోట్లకుగానూ 14 స్థానాల్లో గెలుపుతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో మాత్రమే గెలిచినా అధికార దాహంతో ప్రజాతీర్పును అపహాస్యం చేసింది. సీఎం, స్థానిక మంత్రి సూచనలకు అనుగుణంగా అధికారులు వారికి తొత్తులుగా మారి ప్రజాతీర్పును ఎగతాళి చేశారు’ అని మండిపడ్డారు.
‘మరికొన్ని మున్సిపాలిటీలలోనూ ఇదే రీతిన వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించినా కనీసం మంత్రి స్పందించలేదు. దేశ చరిత్రలో ఇంత ఘోరమైన రాజకీయం లేదు. బాల్క సుమన్‌ను ఇక్కడ జైలులో ఉంచి వారి డ్యూటీకి ఆటంకం కలిగించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టినా కేసు పెట్టలేదు. బీజేపీ ఎంపీ అరవింద్ పోలీసులను తిట్టినా కేసులు పెట్టలేదు. అధికార పార్టీ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తుంటే.. ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. మూడు కోట్ల ఆఫర్ ఇచ్చినా మా కౌన్సిలర్లు లొంగలేదు. సీపీఐ కౌన్సిలర్లు సైతం నిబద్ధతతో ఉన్నారు. పొత్తుధర్మాన్ని పాటిస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పారు.
‘బాల్క సుమన్‌ను జైలులో పెట్టారు. ఆయనకు జైలు కొత్త కాదు. ఆరు నెలలు వివిధ సందర్భాల్లో జైలులో ఉన్నారు. జైలులో పెడితే భయపడతారనుకుంటే పొరపాటే. రేవంత్ రెడ్డికి మళ్ళీ చిప్పకూడు తినే సమయం వస్తుంది. పోలీసులను బూతులు తిడితే కేసులు పెట్టని డీజీపీ బీఆర్ఎస్ నేతలపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తిరిగి రాష్ట్రంలో గులాబి జెండా ఎగురుతుంది. ఏ కలుగులో దాక్కున్నా అరాచకాలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కుతున్న వారిని వదలం. క్యాతన్ పల్లి, ఇబ్రహీం పట్నం, ఖానాపూర్‌లో వెంటనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు.
‘నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికే వారిని వదలం. క్యాతన్‌పల్లిలో మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై సైతం కేసు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నది. అధికార పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. బాల్క సుమన్‌ను దగ్గరలో ఉన్న జైలులో పెట్టకుండా దూరంగా ఉన్న జైలులో పెట్టి.. దోమలు ఎక్కువగా ఉన్న గదిలో ఉంచి వేధిస్తున్నారు. వీటన్నింటిని గుర్తుపెట్టుకుంటాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. pic.twitter.com/CNLcEJqxqk
— BRS Party (@BRSparty) February 24, 2026