మిర్చికి గిట్టుబాటు ధర లేక.. పంట దిగుబడి రాక రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో మిర్చినే నమ్ముకొని నల్లరేగడి భూముల్లో సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత ధర, మార్కెట్ మాయాజాలంతో ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. గోదావరి, వాగుల తీరాల్లో ఎటుచూసినా ఆరబోసిన మిర్చి దర్శనమిస్తుండగా ప్రస్తుతం ఉన్న ధరతో బెంబేలెత్తుతున్నారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లోని గోదావరి నది పరీవాహక ప్రాంతంలో సుమారు 17వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు అధికారుల అంచనా. రైతు ఒక్కో ఎకరం సాగు చేసేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వెచ్చిస్తున్నాడు. పంట చేతికొచ్చే వరకు సర్వం చాకిరీ చేస్తున్న రైతన్న పంట అమ్ముకునే వరకు గ్యారెంటీ లేకుండా పోయింది.
– ఏటూరునాగారం, ఫిబ్రవరి 24
ప్రస్తుతం మిర్చి కోతలు పడుతుండగా నల్ల తామర తెగులు(నల్లి వైరస్) సోకి పంట ఎండిపోతున్నది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తీరా పంట పండించి మార్కెటుకు అమ్ముకునేందుకు వెళితే వ్యాపారుల దోబూచులాటలో రైతు ఓడిపోతున్నాడు. గిట్టుబాటు ధర లభించకున్నా వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్మాల్సిందే. లేకుంటే అప్పులు ఏడాది పొడవునా కట్టాల్సిందే. ఒక్కో ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తే రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రస్తు తం ఎకరానికి పది నుంచి 15క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం మిర్చి రకాన్ని బట్టి ధర ఉండగా క్వింటాకు రూ.12వేలు పలుకుతోంది. ఇక ఎకరానికి సగటున రూ.లక్ష వరకు ఈ సంవత్సరం నష్టం వచ్చేలా ఉందని పలువురు రైతులు వివరిస్తున్నారు. 20 క్వింటాళ్లు పం డించిన రైతుకు మాత్రమే పెట్టుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతులు వివరిస్తున్నారు. స్థానికంగా మార్కెటు లేకపోవడంతో వరంగల్ మార్కెటుకు తరలిస్తున్నారు. పెట్టుబడి రాక చేసిన అప్పులు తీరక చిన్న సన్న కారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కన్పిస్తుంది. ఇక కౌలు రైతులకు మరో రూ.30 నుంచి 40వేల వరకు అదనపు భారం పడుతోంది. అయితే వేల ఎకరాల్లో మిర్చి సాగు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావు.
ఇక కోల్డ్ స్టోరేజీలు స్థానికంగా లేకపోవడంతో వరంగల్ తరలించాల్సిందే. రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ కనీసం పట్టించుకునే వారు లేకుండా పోయారు. మిర్చి సాగు చేసే ఉండే ధర పంట చేతికొచ్చే వరకు పడిపోతుండడంతో రైతుకు నిరాశే మిగులుతోంది. కనీసం మిర్చి ధర క్వింటాకు రూ.16 నుంచి వేల వరకు రూ.20వేల వరకు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం తరహాలో మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ సంస్థలు కొనాలని రైతులు కోరుతున్నారు.
రూ.2లక్షలకు పైగా నష్టమే
నేను రెండెకరాలు కౌలుకు తీసుకున్నా. ఎకరానికి రూ.35 వేల చొప్పున కౌలు చెల్లించా. 15 ఏండ్ల నుంచి మిర్చి సాగు చేస్తు న్నా. గతేడాది కూడా అక్కడికక్కడికే వచ్చింది. ఎకరానికి పది క్విం టాళ్లు మాత్రమే దిగుబడి వస్తుం ది. ఇప్పటివరకు రూ.5లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. నల్లి తెగులు రావడం దిగుబడి రావడం లేదు. రెండు లక్షలకు పైగా నష్టం వచ్చేట్లు వుంది. కనీసం రూ.18వేలు క్వింటా కు చెల్లిస్తే బయటపడే అవకాశం ఉంది. గత ఏడాది రూ.14వేల వరకు ఉంది. ఇప్పుడు మాత్రం తగ్గింది.
– దాసరి సత్యనారాయణ, ఏటూరునాగారం
బోనస్ రాకపోయే మిర్చి నష్టమాయే
రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరానికి రూ.2లక్షల వరకు ఖర్చు అయ్యాయి. ఎకరానికి పది క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదు. నల్ల తామర తెగులుతో మొక్కలు చనిపోయాయి. దీంతో ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టం వచ్చింది. కనీసం 18 క్వింటాళ ్లపైన దిగుబడి వచ్చి రూ.20వేలు ధర ఉంటే బయటపడే అవకాశం ఉంది. ఇదిలా నష్టం జరుగుతుంటే ధాన్యం సాగు చేసి ఈ సంవ్సతరం వంద క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే మిల్లర్లు, కేంద్రం వారు కలిసి ఐదు క్వింటాళ్లు తీసేశారు. 95 క్వింటాళ్లు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ ఇవ్వలేదు. ప్రకటించిన బోనస్ ఇంకెప్పుడు ఇస్తరు. రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని ధర పెంచాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
– సునారికాని భిక్షపతి, ఏటూరునాగారం