వరి రైతుకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, ఇంతలో మాయదారి వాన అందుకోవడంతో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. మంగళవారం సాయంత్రం నుంచి తేలికపాటి జల్లులతో మొదలై బుధవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, నర్సంపేట సహా చాలా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరింది. దీంతో నీటిని ఎత్తిపోసి, తడిసిన వడ్లను ఆరబోసు కుంటూ పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడాల్సి వచ్చింది. సర్కారు కొంటుందనే నమ్మకం లేకపోవడంతో చేసేదేమీలేక ధాన్యం బస్తాలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. అలాగే వర్షంతో మామిడికి తెగుళ్లు సోకే ప్రమాదం ఉండగా పలుచోట్ల ఆరబోసిన మిర్చి కూడా తడిసిసోయింది. మరో రెండు రోజులు వర్షాలు పడే సూచనలు ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ నిత్యం చేసే వర్షం హెచ్చరికల్లో పలు జిల్లాలు లేనప్పటికీ వర్షం మాత్రం మోస్తరుగా కురిసింది. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కొన్ని పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. మిరప కోతలు ఇప్పుడిప్పుడే మొదలు కాగా కోసి కల్లాల్లో ఆరబోసిన పంట అకస్మాత్తుగా కురిసిన వానకు ముద్దయింది. పంట దెబ్బతిని నాణ్యత కోల్పోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. టార్పాలిన్లు కప్పినప్పటికీ లోపల వేడి పెరిగి మిరప కాయలు నల్ల రంగులోకి మారుతాయని ఆవేదన చెందుతు న్నారు. ఇక పూత దశలో ఉన్న మామిడిపైనా వర్షం ప్రభావం పడనున్నది. హనుమకొండ జిల్లాలో 5వేల ఎకరాల్లో మా మిడి సాగవుతున్నది. ఈ ఏడాది సాగు ఆశాజనకంగా ఉందని రైతులు సంబురపడినప్పటికీ తాజా వర్షాలతో బూడిద తెగులు సోకే ప్రమాదం ఏర్పడింది. వచ్చిన పూత రాలిపోవడంతో పాటు నల్లబడి పోయే అవకాశాలున్నాయి.
ప్రస్తుత వర్షాలు కేవలం రైతులకే కాకుండా గీత కార్మికులకు తీరని నష్టాన్ని కలిగించనున్నాయి. ఏటా అక్టోబర్ నెల మొదలు ఫిబ్రవరి, మార్చి వరకు పోద్దాడు కళ్లు అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలోనే గీత కార్మికులు నాలుగు రూపాయలు వెనకేసుకుంటారు. గ్రామా ల్లో ఇప్పుడిప్పుడే పోద్దాడు గెలలు వస్తున్నాయి. అయితే ఈ పోద్దాడు కల్లు సమయంలో వర్షాలే కాదు, కేవలం ఆకాశంలో మబ్బులు కమ్మినా కూడా కల్లు గీతకు తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. తాజా గా కురుస్తున్న ఈ అకాల వర్షాల వల్ల గీత కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోనున్నారని కార్మిక సంఘాలు ఆవేదన చెందుతున్నాయి.
ఇనుగుర్తి : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే వర్షాలకు వడ్లన్నీ తడిసిపోయాయి. 28రోజుల క్రితం 315 బస్తాలు కేంద్రానికి తెచ్చిన. 10రోజుల క్రితం కాంటాలు పెడితే 125 క్వింటాలు అయినయ్. కాంటాలు అయినంక మిల్లులకు పంపలేదు. ఇంతలో వర్షం పడి వడ్లు తడిశాయి. మాకు ఎలాంటి కట్టింగ్ లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లులకు తరలించాలి.