తొర్రూరు, జులై 18: అన్నదాతను ఆదుకుని వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది ఓర్వలేని కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలతో కుటిల రాజకీయానికి తెరలేపి లబ్ధిపొందాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు క్లస్టర్ల వారీగా రైతు వేదికల వద్ద టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కుట్రపూరిత వ్యాఖ్యల్లోని ఆంతర్యాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరిస్తున్నట్లు తెలిపారు.
ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని కనీస పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు సమర్ధించుకుంటూ 24 గంటల ఉచిత విద్యుత్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ వినియోగంపై కాంగ్రెస్ కళ్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తుదని, ప్రతి రైతు వాస్తవాన్ని గ్రహించాలని కోరారు. తెలంగాణ సాధించకముందు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఉచిత విద్యుత్ తీరును, తెలంగాణ సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న విద్యుత్ రైతులు గుర్తించారని అన్నారు.
కాంగ్రెస్ చెబుతున్నట్టు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కావాలా? ప్రభుత్వం అందిస్తున్న సాగునీరు, ఉచిత కరెంట్‌తో మూడు పంటలు కావాలా ఆలోచించాలన్నారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడు జరుగుతున్న అభివృద్ధి, దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా ఎదిగిన విధానం, సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రాజెక్టుల నిర్మాణం, భూములకు పెరిగిన ధరలు.. ఇవ్వన్నీ కాంగ్రెస్‌కు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు వేదికల వద్ద క్లస్టర్ల వారీగా సభలు నిర్వహించాలని సూచించారు.
ఉచితంగా నర్సింగ్ శిక్షణ…
పాలకుర్తి నియోజకవర్గంలో ఇంటర్ ఉత్తీర్ణత పొందిన యువతులకు వారి ఆసక్తి మేరకు ఉచితంగా నర్సింగ్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. యువతులకు స్వయంఉపాధి కోసం కిమ్స్ దవాఖానకు సంబంధించిన కళాశాలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించినా వెళ్లొచ్చని, పూర్తిస్థాయి శిక్షణ పొందిన వారికి నూరుశాతం నర్సింగ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు శిక్షణ కోసం దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 18 ఏళ్లు దాటిన యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
వివిధ కారణాలతో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను మంత్రి దయాకర్‌రావు పరామర్శించారు. నాంచారిమడూర్లో గిద్దె వెంకటసోములు, వెంకటాపురంలో బిజ్జాల కిష్టయ్య, కేవ్లాతండాలో జోగ్యానాయక్ చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రముఖ గాయకుడు, రచయిత గిద్దె రాంనర్సయ్య ఇటీవల అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయన వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొర్రూరుకు చెందిన మోచికుల సంఘ నాయకుడు అలిసేరి రవిబాబుతో పాటు ఆయన కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, రైతుబంధు సమతి మండల కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, మండల, పట్టణ పార్టీ కార్యదర్శులు నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్, ఎస్కే అంకూస్, సర్పంచులు కాలూనాయక్, కడెం యాకయ్య, శీలం లింగన్నగౌడ్, గుంటుక యాదలక్ష్మి యా కయ్య, నాయకులు శామకూరి ఐలయ్య, దొంగరి శంకర్, బిజ్జాల అనిల్, సంపత్, మణిరాజ్, జంపా పాల్గొన్నారు.