తొర్రూరు : రేవంత్‌రెడ్డి 420 సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి 420 రోజులు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని, దద్దమ్మ కాంగ్రెస్‌కు దారి చూపించాలని, చేతకాని ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని వినతి పత్రంలో వేడుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని, పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు ప్రజల తరపున ధ్వజమెత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు పొనుగంటి సోమేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, పార్టీ పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ ఏ ప్రదీప్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు, మణిరాజు, తూర్పటి రవి, శంకర్, జైసింగ్, ఎసే అంకూస్, కాలునాయక్, రాయశెట్టి వెంకన్న, జాటోత్ స్వామి, భాసర్, సోమలింగం, డిష్ శ్రీనివాస్, ఏల్పుకొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.