పాలకుర్తి/పెద్దవంగర, ఆగస్టు24 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలకు తెలిసొచ్చిందని, మోసపోయి గోసపడుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి గా విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి దర్దేపల్లి మాజీ ఎంపీటీసీ సిద్ధం యుగేంధర్, తొర్రూరు (జే) పీఏసీఎస్ వైస్ చైర్మన్ బానోత్ రాంధన్, మంచుప్పులకు చెందిన కాకర్ల కుమార్, రాజు, చీమలబావి తండాకు చెందిన యువకులు సుమారు 200 మంది, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం మాజీ సర్పంచ్ సల్దెండి మంజులసుధాకర్తో పాటు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలనలో అన్నదాతలకు అన్నీ కష్టాలేనన్నారు. ఆయనకు ఢిల్లీకి మూటలు మోయటం తప్ప.. రైతులకు ఎరువుల బస్తాలు ఇచ్చేది తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికి కాంగ్రెస్‌కు పట్టింపులేదన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ. 70-80 కోట్ల పనులు ఆగి ఉన్నాయని, వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు రోడ్లెకితే కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, అందుకోసం కార్యకర్తలు కృషిచేయాలన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, పాలకుర్తి, పెద్దవంగర, కొడకండ్ల, దేవరుప్పుల, మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు పసునూరి నవీన్, ఐలయ్య, రా మోజీ, దయాకర్, పాలకుర్తి మాజీ జడ్పీటీసీ పు స్కూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎస్సీఎస్ బ్యాం క్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, నాయకులు జర్పుల బాలునాయక్, కత్తి సైదులు, ఇమ్మడి ప్రకాశ్, గిరగాని సమ్మయ్య, కమ్మగాని నాగన్న, సోమనర్సింహారెడ్డి, సునీల్‌రెడ్డి, సంజయ్, సుధీర్, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దర్దేపల్లిలో కవి, రచయిత దాశరథి రంగాచార్యులు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.