హసన్పర్తి, మే 9: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 2 డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి, కాంటాల కోసం రోజుల తరబడి కంటిమీద కునుకు లేకుండా పడిగాపులు కాస్తున్నారని, అకాల వర్షాలు మరింత ఇబ్బందిపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తూ, వారి ప్రాణాల మీదికి తెస్తున్నదన్నారు. ఈదురుగాలు, అకాల వర్షాలతో దినదిన గండంగా గడుపుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టిందన్నారు. పెండింగ్లో ఉన్న రూ.500 కోట్ల పంట బోనస్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, నాయకులు పాల్గొన్నారు.
తొర్రూరు, మే 9: తొర్రూరు మండలం కరాల, హరిపిరాల గ్రామాల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ఇబ్బంది పడుతుండగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారికి అండగా నిలిచారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో మాట్లాడారు. ఆయన వెంటనే స్పందించి రెండు లారీలను పంపించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం, బోనస్ చెల్లింపులో జాప్యం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు.