ఎల్కతుర్తి, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనను చూసిన ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడే తప్ప ఎప్పుడూ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. అసలు ఆయనకు తెలంగాణ అంటేనే ఇష్టముండదని, మూర్ఖుడు, దొంగ అని దుయ్యబట్టా రు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభ స్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
సభా ప్రాంగణానికి వచ్చే రహదారులను చూసిన ఆయన నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సం దర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో పదేండ్ల క్రితం నాటి దుస్థితి దాపురించిందని విమర్శించారు. తాగు, సాగు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఇస్తామని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మొన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పల్లెలు నేడు కళావిహీనంగా మారాయన్నారు.
ఎండిపోయిన, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి ఎప్పుడు ఏ భూమి అమ్ముదా మా అనే ఆలోచన తప్ప పాలనపై పట్టు లేదన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో మం ది విద్యార్థులు, ప్రజలు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు కేసుల పాలయ్యారన్నారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడితేనే తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. తెలంగా ణ రాకముందు నీళ్లు, నియామకాలు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కాళేశ్వరం, ఆసరా పిం ఛన్లు లాంటి పథకాలున్నాయా అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
ప్రజలకు కాంగ్రెస్ మోసాలను వివరించి వారిని జాగృతం చేయడానికే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. తొలుత 5-6 లక్షల మంది వస్తారని అంచ నా వేశామని, ఇప్పుడు 11లక్షల వరకు ప్రజలు తరలివచ్చే అవకాశముందన్నారు. కొన్ని ప్రాంతాల్లో చందాలు వేసుకొని సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపడం హర్షణీయమన్నారు.
వరంగల్-కరీంనగర్-సిద్దిపేట రూట్లలో పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని, యుద్ధప్రాతిపదికన సభా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆయన వెంట కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవారెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, పార్టీ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, నాయకులు తంగెడ మహేందర్, గొల్లె మహేందర్, దేవేందర్‌రావు, గొడిశాల వినయ్, జూపాక జడ్సన్, చిట్టిగౌడ్, ఉట్కూరి కార్తీక్, ఎండీ మదార్, రాజేశ్వర్‌రావు, సతీశ్ పాల్గొన్నారు.