పర్వతగిరి, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమావేశంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు గులాబీ పార్టీలో చేరగా, వీరికి ఎర్రబెల్లి దయాకర్రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భం గా దయాకర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితనం బాగా లేకనే బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ఆదరణ పెరిగిందని అన్నారు. కష్టకాలంలో వెంబడి ఉన్నవారే మన వారని పేర్కొన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, సర్వేలన్నీ మన వైపే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గుడి చేతిలో పడి నాశనం అవుతుందన్నారు. ప్రతి ఒక కార్యకర్తని కలుపుకొని పోవాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒకరూ కష్టపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ హామీ లను గడపగడపకూ వెళ్లి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు.
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని, తొందర్లోనే కమిటీలు వేసి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడు దల చేసిందన్నారు. ఈ సర్కారు హయాంలో రైతులు అరిగోస పడుతున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. పార్టీ క్యాడర్, యూత్ సోషల్ మీడియా నాయకులు ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మన సత్తాచాటాలని కోరారు. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
టీపీసీసీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తేజావత్ వినీత్ ఆధ్వర్యంలో నర్రేంగ, ఎన్జీ, మల్యా తండా, కల్లెడ, చౌటపల్లి, అన్నారంషరీఫ్లకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 200 మంది వరకు వివిధ పార్టీల వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం పర్వతగిరికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుండి హరీశ్ తండ్రి సారంగపాణి మృతి చెందగా, నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ పంతులు నాయక్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, కొండ వెంకటేశ్వర్లు, చిదురు తిరుపతి, అంబటి కుమార్, నీరటి వెంకన్న, నీరటి జానీ, నీరటి ప్రశాంత్, చిన్నపెల్లి దేవేందర్, అజయ్, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.