రాయపర్తి, ఫిబ్రవరి 10 : దేశంలోనే గొప్ప విజన్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కుందూరు వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అధ్యక్షతన జరిగిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లోని 16 ఎంపీటీసీ స్థానాల పరిధి నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్ దూరదృష్టితో దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా వంటి అద్భుత పథకాలకు శ్రీకారం చుట్టి పదేళ్లు విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు 15 నెలల కాలంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి రాజకీయ బ్రోకర్ అని, ఉదయం ఒక మాట, సాయంత్రం మరో మాట మాట్లాడతాడని, ఆయన సర్కారు రానున్న ఆరు నెలల కాలంలోనే కాలగర్భంలో కలసి పోతుందని జోస్యం చెప్పారు.
ఎన్నికల తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వడం ఖామయని, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పక వస్తాయన్నారు. అంతేగాక ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డిపై 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగితే భవిష్యత్తులో బీఆర్ఎస్కు పూర్వ వైభవం చేకూరుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఎర్రబల్లి కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల ఇన్చార్జులు పల్లా సుందర్‌రాంరెడ్డి, గుడిపూడి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.