పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు పలికితే వర్ధన్నపేటను సంపూర్ణంగా అభివృద్ధి చేయడంతో పాటుగా అన్ని సంక్షేమ పథకాలు అందేలా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి కేసీఆర్, కేటీఆర్‌ల సహకారంతో కృషి చేస్తామన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ అయిన తొర్రూరును అభివృద్ధి చేసిన ఘనత తనదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నా తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. తాను మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే తనకు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అన్ని పనులను కావాలనే నిలిపేశారని ఆరోపించారు. తొర్రూరు మండలంలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని తెలిపారు. కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి పోలీసుల ద్వారా పర్మిషన్ రద్దు చేయించారని ఆరోపించారు.
శనివారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగిందని, అందుకే కేటీఆర్ రాకుండా చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా అవి ఫలించలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అండతో తొర్రూరులో పోలీసులు రెచ్చిపోతున్నారని, ఇటీవల కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సందర్భంగా ధర్నా చేస్తే తనతో పాటు 33 మందిపై అక్రమ కేసులు పెట్టి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని వాపోయారు. తొర్రూరు మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.