పాలకుర్తి, జూన్ 7 : ‘ ఎండల ఎండుతున్నాం.. వానల నానుతున్నాం.. రెండు నెలలైనా పట్టించుకునే దిక్కులేదు.. దయన్నా..వడ్లు కాంటాలు అయితలే… ఎమ్మెల్యే వస్తలేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ పాలనే బాగుండే..మళ్లీ మీరే రావాలి.. కాంగ్రెస్ పాలనలో రైతులకు చావే శరణ్యం’ అంటూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఫోన్ చేసి ఆవేదన చెందారు. దీంతో స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి తక్షణమే ఈరవెన్నులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
రైతుల్లో భరోసా నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్ల కాంటాల కోసం ఎర్రటి ఎండలో రైతులను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి వారి ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ఎరువుల కోసం కొన్నాళ్లు ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడుతున్నామన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలకు రైతుల బాధలు పట్టావా.. అని మండిపడ్డారు. దమ్ముంటే కొనుగోలు కేంద్రాలకు రావాలని సవాల్ విసిరారు. లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారన్నారు.
తరుగు పేరుతో దోపీడీ చేస్తే ఉద్యమిస్తామన్నారు. రైతుల వద్ద కాంటాల కోసం పైసలు వసూలు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రెండు రోజుల్లో ధాన్యం వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పసునూరి నవీన్, నల్లా నాగిరెడ్డి, ముస్కు రాంబాబు, మాచర్ల ఎల్లయ్య, దామోదర్, గాదెపాక కిరణ్, కత్తి సైదులు, కోల నారాయణ, అనుముల నర్సయ్య, వీరమనేని సోమేశ్వర్రావు, బానోత్ మహేందర్, జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు.