దేవరుప్పుల/పాలకుర్తి, జూలై 18 : వానలు లేక గోదావరి జలాలు రాక సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలోని రైతాంగం అరిగోస పడుతున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో గోదావరి జలాలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. శుక్రవారం దేవరుప్పుల మండలంలోని మాదాపురం దంతాల తండా నుంచి పాలకుర్తి మం డలంలోని శాతాపురం, ఈరవెన్ను వరకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దేవాదుల కాల్వల వెంట పాదయాత్రగా వెళ్లారు.
రైతులు, కూలీలను కలిసి ముచ్చటించారు. రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను ఎర్రబెల్లికి చెప్పుకొన్నారు. రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాతాపురం క్రాస్‌రోడ్డు వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో పాలకుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నదన్నారు. రైతులు వద్దు అనేంత వరకు గోదావరి జలాలతో చెరువులు నింపానని గుర్తుచేశారు.
కేసీఆర్ పాలనలో చెరువులు మత్తళ్లు దూకాయన్నారు. కాల్వలు లేకున్నా చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. గోదావరి జలాలతో చెరువులు నింపడంలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ప్రణాళిక లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులు కష్టాలు మొదలయ్యాయని, నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే రైతుల పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు మాటలు తప్ప చేతలు సాధ్యం కావడం లేదన్నారు. అబద్ధపు మాటలు, 420 హామీలతో రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడన్నారు. మోసపు మాటలతో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు.
పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్టులు చేసినా రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని రైతుల సమస్యలే ముఖ్యమని చెప్పారు. పాలకుర్తి, చెన్నూరు, ఉప్పుగల్లు రిజర్వాయర్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలన్నారు. నిధులున్నా ఎందుకు రిజర్వాయర్ పనులు కావడం లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. నవాబ్‌పేట రిజర్వాయర్‌ను నింపి దేవరుప్పుల మండల రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. కాగా పాదయాత్రకు ప్రజలు, రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. రైతులు తమ బాధలను ఎర్రబెల్లికి వివరించారు. తప్పు జరిగిందని ఇక ముందు జరగదని భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని రైతులు ఎర్రబెల్లికి భరోసానిచ్చారు.
ఉదయం 8 గంటలకు మొదలైన పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర కొనసాగి 12 గంటలకు ముగిసింది. ఎర్రబెల్లి పాదయాత్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, వీరారెడ్డి అశోక్‌రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, ఏల సుందర్, బస్వ మల్లేశం, కొల్లూరు సోమయ్య, ధరావత్ రాంసింగ్, కోతి ప్రవీణ్, వంగ అర్జున్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తీగల దయాకర్, పసునూరి నవీన్, ఈదూరు ఐలయ్య, సిందె రామోజీ, మూనవత్ నర్సింహనాయక్, మడికొండ ఎల్లయ్య, ధరావత్ గాంధీనాయక్, మాజీ జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, మంగళంపల్లి శ్రీనివాస్, శ్రీరాం సుధీర్‌కుమార్, రంగు కుమార్, మాజీ ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, వి.రాంచంద్రయ్య శర్మ, పేరం రాము, ఎలికట్టె సోమన్న, కుర్ర శ్రీనివాస్, కొల్లూరు సోమయ్య, మాచర్ల ఎల్లయ్య, కారుపోతుల వేణు, శ్యామకూరి ఐలయ్య, రామిని శ్రీనివాస్‌తో పాటు పాటు అన్ని గ్రామాల రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేవాదుల నీరు వదిపెట్టాలే చూడు సారూ అంటూ నియోజకవర్గ రైతులు ఫోన్లు చేస్తుండ్రు. ఈ ఫోన్లు చేస్తున్న వారిలో కాంగ్రెస్ వాళ్లూ ఉన్నరు. నీళ్లు లేక పరిస్థితి అధ్వానంగా ఉంది. వర్షాలు లేవు. ఈ టైంల మనం దేవాదుల నీరు వదిలి చెరువులు కుంటలు నింపాలె. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నింపాలనే సోయి ప్రభుత్వానికి లేకుంటె ఎట్లా?. కేసీఆర్ హయాంల చూడలేదా? ఎండాకాలం దేవాదుల నీటితోని చెరువులు నింపేది. చెక్‌డ్యాంలు పొంగి పొర్లేది. ఈ ప్రభుత్వానికి చాతగాదా?. నీళ్లుండీ ఇవ్వకపోవడం ఏంటి. రైతులు గోసపడుతుంటే మంత్రులు ఏం చేస్తుండ్రు, ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు. నేను పాదయాత్ర చేస్తుంటె రైతులు బోరున ఏడుస్తుండ్రు. వాళ్ల గోస చూడలేకపోతున్న. బిందెలతోని నీళ్లు తెచ్చి నారుకు పోస్తున్నరట, పంటలు ఎండినయ్. దేవాదుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. కరెంటు బిల్లులు కడుతలేరు. నీళ్లుండీ దేవాదుల పంపులు నడుపుతలేరు. రైతుల గోస చూడలేక ఈ పాదయాత్ర చేసిన.
దేవరుప్పుల : కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది సారూ అంటూ పాదయాత్ర చేస్తున్న ఎర్రబెల్లికి తన ఎండిపోయిన పొలాన్ని చూపించాడు మాదాపురం రైతు జట్టి సుధాకర్. రెండు బోర్లు ఎండినయ్.. నీళ్లు లేవని పొలం దున్ని ఒడ్లు అలుకుడు చేసినా ఎండింది. మీరున్నప్పుడు ఏ కరువులైనా నీళ్లు పారేది, బోర్లు పుష్కలంగా పోసేది. కాంగ్రెస్ వచ్చినంక గింత కష్టమచ్చింది సారూ అంటూ ఎర్రబెల్లితో గోడు వెల్లబోసుకున్నాడు.
– జట్టి సుధాకర్, రైతు, మాదాపురం