దేవరుప్పుల, ఫిబ్రవరి 27 : నీళ్లుండీ ఇవ్వలేని దుస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దాపురించిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక సగం, ముప్పావు పొలాలు ఎండుతున్నాయని, వాటిని రైతులు జీవాలకు అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూపించారు. వాటిని పరిశీలించిన ఆయన బోరున ఏడుస్తున్న రైతులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తాకుతుందన్నారు. అప్పులు తెచ్చి యాసంగి నాట్లు పెడితే పొలాలు నెర్రెలు పడుతున్నాయన్నారు. రైతులు ఆశ చావక అప్పుతెచ్చి బోర్లు వేస్తూ ఇంకా అప్పుల పాలవుతున్నారన్నారు. దేవాదుల నీళ్లు వదిలితే ఇంత కష్టం ఉండకపోవన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారులతో మాట్లాడి ఇటు నవాబుపేట, అటు స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ల నుంచి యాసంగి పంటకు నీళ్లు వదిలినట్లు చెప్పారు.
చెరువులు, చెక్‌డ్యాంలు ఎండాకాలం అలుగులు పోసేవని, దీంతో భూగర్భ జలాలు పెరిగి, బోర్లు పోసి పంటలు పుష్కలంగా పండేవన్నారు. తాను సాగునీటి అధికారులకు ఎప్పుడు ఫోన్ చేసినా రెండు రోజుల్లో నీళ్లు వదులుతామంటున్నారే తప్ప విడుదల చేయడంలేదన్నారు. పచ్చని పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎడారిగా మారుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. ప్రభుత్వానికి పంటలపై పట్టింపులేదని, కేసీఆర్ హయాంలో రైతుల కళ్లలో ఆనందం కనిపించేదన్నారు. ఏ ఊరు, ఏ తండాకు పోయినా కేసీఆర్ దేవుడంటున్నరని, మళ్లీ సారే రావాలని కోరుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. స్థ్ధానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు.