రాయపర్తి, డిసెంబర్ 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తున్నది? రైతు భరోసా పడిందా? రూ. 2 లక్షలలోపు రుణాలు మాఫీ చేసిండా? ధాన్యం విక్రయించిన, బోనస్ డబ్బులు పడుతున్నాయా? అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులను ప్రశ్నించారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఊకల్ గ్రామానికి చేరుకున్న ఆయన రైతులతో ముచ్చటించగా.. అంతా మోసం జరుగుతున్నదని వారు సమాధానమిచ్చారు. అనంతరం గట్టికల్ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఆసరా పింఛన్ల కోసం బారులు తీరిన వృద్ధుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
ముఖ్యమంత్రి పెంచిన పింఛన్లు ఇస్తున్నడా? అని అడిగారు. దీంతో వృద్ధులంతా కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండె.. ఇప్పుడు పింఛను ఎప్పుడొస్తున్నదో.. ఏ నెల బాపతివి ఇస్తున్నరో తెల్వడం లేదంటూ వివరించారు. భవిష్యత్‌లో కారు పార్టీకే అండగా ఉంటామని, కేసీఆర్‌నే గెలిపించుకుంటామంటూ ఎర్రబెల్లికి భరోసా ఇచ్చారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాడని ఫైర్ అయ్యారు. అబద్ధాల కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు దగ్గరపడ్డాయన్నారు. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దయాకర్‌రావు దుప్పట్లు పంపిణీ చేశారు.
మండలంలోని శివరామపురం గ్రామానికి చెందిన నకిరేతు అశోక్‌కుమార్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో గొడవలు, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించలేక తిరిగి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.