హనుమకొండ, జూన్ 16 : ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులకు టీజీఎన్పీడీసీఎల్ అధికారులు సంతాప సభ ఏర్పాటు చేసారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హనుమకొండ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంలో హనుమకొండ డివిజన్ టెక్నికల్ డీఈ అయిరెడ్డి విజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో అమరులైన మెట్టుపల్లి, వల్గొండ సెక్షన్ ఏఎల్ఎం రాజేశం, డోర్నకల్ టౌన్ ఏఎల్ఎం క్రాంతి చిత్రపటాలకు పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటంచారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అనంతరం విద్యుత్తు అధికారులు మాట్లాడుతూ ప్రమాదాల కారణాలు, వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సేఫ్టీ నిబంధనలు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పిపిఈ) వినియోగం, విధి నిర్వహణలో పాటించాల్సిన నియమావళి పట్ల పూర్తి అప్రమత్తత అవసరమని హితవు పలికారు. సురక్షిత విధి నిర్వహణలో ప్రగాఢనిబద్ధత అవసరమని, ప్రతి ఉద్యోగి దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఎస్ఈ పి. మధుసూధన్‌రావు, సీనీయర్ అకౌంట్స్ ఆఫీసర్ నవీన్‌కుమార్, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.