హనుమకొండ చౌరస్తా, నవంబర్ 29 : వరంగల్ రీజియన్‌కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి.. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రీజియన్‌కు 82 బస్సులను కేటాయించగా, ఇందులో సూపర్ లగ్జరీ-18, డీలక్స్-14, సెమీ డీలక్స్-21, ఎక్స్‌ప్రెస్‌లు-29 ఉన్నాయి.
వీటిని హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటిలో 34 సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు వరంగల్-2 డిపోకు చేరుకోగా, అందులోనే ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను నిర్వహిస్తున్నది. త్వరలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీలో 41, డీలక్స్‌లో 45 సీట్లు 2+2 ప్యాటర్న్‌లో, ఎక్స్‌ప్రెస్‌లో 55 సీట్లు 2+3 ప్యాటర్న్‌లో డిజైన్ చేశారు.
అత్యాధునిక హంగులతో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కోసం ఫ్రంట్ అండ్ రియర్ ఎయిర్ సస్పెన్షన్, ఒక నెల బ్యాకప్‌తో క్యాబిన్, సెలూన్లో ఒక్కొక్కటి చొప్పున అంతర్గత, ఫ్రంట్, రియర్ కెమెరాలు ఉన్నాయి. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బజర్ ప్రొవిజన్, ప్రతి సీటుకు మొబైల్ యూఎస్బీ చార్జింగ్ సదుపాయం, అంతర్గత ప్రకటనల కోసం పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, ప్యాసింజర్ డోర్‌తో పాటు రెండు అత్యవసర డోర్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.
ప్రయాణికుడు డోర్లో నిలబడితే అది మూసుకోకుండా యాంటీ పించ్ ఫీచర్ ఉంది. ఈ బస్సుల్లో క్లచ్, గేర్ బాక్స్ ఉండవు. వాహనం కదలిక కోసం డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ (డీఎన్ఆర్) బటన్ మాత్రమే ఉంటుంది. ఈ బస్సులను పూర్తి చార్జింగ్ చేస్తే 360 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. సింగిల్ పిన్‌తో రెండున్నర గంటలు, డ్యూయల్ పిన్‌తో ఒకటిన్నర గంటల్లో చార్జింగ్ అవుతుంది. బస్సులు గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
కాలుష్యరహిత సమాజం కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు 34 బస్సులు వరంగల్-2 డిపోకు చేరుకున్నాయి. త్వరలో మంత్రుల చేత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో 12 వరకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల అవసరాన్ని బట్టి బస్సులు పెంచడం, లేదా తగ్గించడం చేస్తాం. ఎట్టిపరిస్థితుల్లో వరంగల్-2 డిపోను ప్రైవేట్ పరం చేయం. జేబీఎం సంస్థకు కిరాయికి ఇచ్చాం.
– డీ విజయభాను, వరంగల్ రీజినల్ మేనేజర్