ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్‌లీల కార్యక్రమాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలుచోట్ల రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజువ్వల వెలుతురులో మైదానాలన్నీ మిరుమిట్లు గొలిపాయి. విజయదశమి వేడుకల్లో భాగంగా ఆలయాలు, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జమ్మిచెట్ల వద్ద పూజలు చేశారు. పాలపిట్ట దర్శనం అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుని.. అలయ్‌బలయ్ తీసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది ఆయుధ పూజ చేశారు. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రామ్ లీలాను ప్రారంభించగా, తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన జనంతో వరంగల్ నగరంలోని మైదానాలు కిక్కిరిశాయి. దేవీనవరాత్రోత్సవాలు పరిసమాప్తం కాగా చివరి రోజు దుర్గాదేవి శోభాయాత్ర వైభవంగా నిర్వహించి నిమజ్జనం చేశారు.
నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 24: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో జమ్మి చెట్ల వద్ద పూజలు చేసి, జమ్మి ఆకును ఒకరికొకరి ఇచ్చి పుచ్చుకుని అలయ్‌బలయ్ తీసుకున్నారు. పోలీస్స్టేషన్లలో ఆయుధ పూజలు నిర్వహించారు. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. తొర్రూరులో రామ్‌లీలాను ప్రారంభించారు. వరంగల్‌లోని ఉర్సు రంగలీల, కొత్తవాడ తోట మైదానం, మట్టికోట తూర్పు ద్వారం వద్ద, చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన రామ్‌లీల కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు పాల్గొని వేడుకలను తిలకించారు. భారీ రావణాసురుడి ప్రతిమను వివిధ రకాల పటాకులతో దహనం చేయడం ప్రతి ఒక్కరినీ అలరించింది.
ఆకాశంలోకి దూసుకెళ్లిన రంగురంగుల పటాకులు కనువిందు చేశాయి. రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి రావణుడి ప్రతిమకు నిప్పంటించారు. హనుమకొండ పద్మాక్షి కాలనీలో ఏర్పాటు చేసిన రామ్‌లీలా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కాజీపేటలోని బాపూజీనగర్ పోచమ్మగుడి ప్రాంగణంలో స్నేహ యూత్, లెవన్ స్టార్ల ఆధ్వర్యంలో రావణాసురుడి ప్రతిమలను దహనం చేశారు. నర్సంపేటలోని అంగడి ప్రాంతంలో భారీ రావణుడి ప్రతిమను దహనం చేశారు. వర్ధన్నపేట, ఇల్లంద, సంగెం మండలం మొండ్రాయి, ములుగు, ఏటూరునాగారం, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు తదితర మండలాల్లో దసరా వేడుకలు అంబ రాన్నంటాయి. కాగా, జనగామలో మంగళవారం రామ్‌లీలా కార్యక్రమం నిర్వహించగా, బతుకమ్మకుంట జనసంద్రమైంది.