జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ సర్కారు పాలనలో పదేళ్లుగా మండుటెండల్లోనూ వాగులు, చెరువులు, కుంటలు, వాగులు పరవళ్లు తొక్కగా, బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరుండేది. కానీ, ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఈ ఏ డాది చెరువులు, వాగులు వట్టిపోవడం, బోర్లు, బావు ల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులకు దిక్కుతోచని పరిస్థితిలో పడేసింది. కొత్తగూడ మండలంలో జనవరిలో 10.43 మీటర్ల లోతుకు వెళ్లిన భూగర్భజలాలు ఫిబ్రవరి నెలాఖరుకు 15.20 మీటర్లకు పడిపోయాయి. అంతేగాక జిల్లాలోని మొత్తం 1063 చెరువుల్లో 744 చెరువుల్లో కేవలం 25శాతం మాత్రమే నీరుండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. వరి పొట్టకొచ్చే సమయంలో నీళ్లు లేకపోవడంతో రైతులు చేసేదేమీ లేక గొర్లను. బర్లను మేపాల్సి వస్తోంది.
– మహబూబాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు చెరువులు, కుంటలు, వాగులు.. బోర్లు, బావులతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 మీద ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వర జలాలను ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వాగులు, చెరువులు నింపి రైతులకు 24గంటలు సాగునీరందించడంతో వ్యవసాయం రంది లేకుండా సాఫీగా సాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి తలకిందులైంది. అదునుకు సాగునీరు విడుదల చేయకపోవడంతో చెరువులు, వాగులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 1063 చెరువులుతో పాటు ప్రధానంగా మున్నేరు, ఆకేరు, పాలేరు, అలిగేరు వాగులున్నాయి.
సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో అడుగంటడంతో వాటి కింద సాగుచేసిన రైతులకు పంటలను కాపాడుకునేందుకు పాట్లు పడాల్సి వస్తోంది. జిల్లాలో అతి పెద్ద చెరువైన బయ్యారం పెద్ద చెరువు ఉన్నప్పటికీ వానకాలంలో ఈ చెరువు ద్వారా 7,500 ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. యాసంగిలో అసలు నీళ్లు ఇవ్వకపోవడంతో బోరుబావుల మీద రైతులు ఆధారపడాల్సి వస్తోంది. అలాగే గార్ల పెద్దచెరువు వానకాలంలో 3వేల ఎకరాలు, యాసంగిలో వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించేవారు. ఇప్పుడు ఈ చెరువు కూడా పూర్తిగా ఎండిపోవడంతో చెరువు కింద సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది.
మున్నేరు వాగు మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి వద్ద ప్రారంభమై బయ్యారం, గార్ల మండలాల మీదుగా డోర్నకల్ వరకు ఈ వాగు ద్వారా ప్రతి యాసంగిలో సుమారుగా 10వేల నుంచి 12వేల ఎకరాల వరకు సాగయ్యేది. ఆకేరు వాగు జిల్లాలో తొర్రూరు మండలం గుర్తూరులో మొదలై నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగు ద్వారా 8వేల నుంచి 10వేల ఎకరాలు సాగయ్యేది. కేసముద్రం మండలం వట్టివాగు ద్వారా 1,500 ఎకరాలు సాగయ్యేది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వాగులకు ఇరువైపులా ఉన్న పంట పొలాలతో పాటు చెరువుల్లో సరిపడా నీళ్లు లేక వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోతుంది. బోరుబావుల ద్వారా కూడా సాగు కావడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నీళ్లు లేక వరి, మక్కజొన్న పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
రైతుబంధు రాలే.. రుణమాఫీ కాలే
నాకు మొత్తం 12 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల్లో వరి, ఎకరంలో మిర్చి, మరో ఎకరంలో మక్కజొన్న మిగతాది పత్తి వేశాను. నా పేరుపై బ్యాంకులో రెండు లక్షలు, నా భార్య పేరుతో రెండు లక్షల కు పైగా రుణం తీసుకున్నాం. ఒక్కరికీ కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పటివరకు ఒక ఎకరానికి కూడా రైతుబంధు పడలేదు. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి మొత్తం వడ్డీకి తెచ్చిన. ఆరెకరాల్లో వరి వేస్తే 5 ఎకరాలు ఎండిపోయింది. బోరుబావుల నుంచి చుక్కనీరు వస్తలేదు. మిగిలిన ఎకరం వరి కూడా ఎండిపోతది.
ఎండిన వరి పొలంలో గొర్లు, బర్లను మేపుతున్నా. ఎకరం మక్కజొన్న పంట కూడా ఎండిపోయింది. అడవి పందులు తింటున్నాయి. వరికి రూ.2 లక్షల పెట్టుబడి అయ్యింది. ఆదాయం రాలేదు. మిర్చి ఎకరం వేస్తే అందులో నష్టపోయా. పత్తిలోనూ నష్టం వచ్చింది. అన్ని పంటలు కలిపి రూ.5లక్షలకు పైగా నష్టపోయా. ఎండిన పంటలు చూసి బావి వద్దకు పోవడం లేదు. గొర్లను మేపుతూ బతుకుతున్న. కేసీఆర్ సర్కారున్నప్పుడు రుణమాఫీ అయ్యింది, ఠంచన్‌గా రైతుబంధు వచ్చేది. పెట్టుబడికి ఎన్నడూ ఇబ్బంది రాలే. రేవంత్‌రెడ్డి సర్కారు అన్నిటికీ ఆగమైతానం.
– పులిగిల్ల సతీశ్, రైతు, గట్లకుంట
ఏరు ఎండి.. రాళ్లు తేలి..
బయ్యారం, మార్చి 4 : పాకాల ఏరు అడుగంటి ఆయకట్టు ఎండుతున్నది. చుక్క నీరు లేక, పంటలను కాపాడుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. బయ్యారం మండలంలోని జగ్గుతండా, బంజారతండా, నర్సాతండా, వెంకట్రాంపురం, చోక్లతండా, పత్యతండా, గొల్లగూడెం, జనార్దనపురం గ్రామాలతోపాటు సరిహద్దు కురవి మండలం గుండ్రాతిమడుగుకు చెందిన రైతులకు పాకాల ఏరు నీరే ఆధారం. సుమారు 1500 ఎకరాలకు పైగా యాసంగిలో వివిధ పంట లు సాగు చేసేవారు. అయితే, రెండేళ్ల నుంచి నీరు సరిగ్గా ఉండడం లేదు. దీంతో ఈ ఏడాది కొందరు రైతులు పంటలు వేయడం మానేయగా, మరికొందరు నీళ్లు వస్తాయనే ఆశతో వరి, మినుములు, పెసర వంటి పంటలు సాగు చేశారు.
అయితే, ఏరులో ఉన్న అరకొర నీటితో ఇప్పటి వరకు పంటలను కాపాడుకున్నారు. ప్రస్తుతం వరిపొట్ట దశకు చేరింది. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో ఏరులో నీరు పూర్తిగా అడుగంటి రాళ్లు, రప్పలు తేలాయి. ఎండుతున్న పంటలను బావుల్లోని నీటితో కొందరు, ఏరులో అక్కడక్కడా నిలిచిన నీటిని మోటర్ల ద్వారా పంటలకు మళ్లించి మరికొందరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటే పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆవేదన చెందుతున్నారు. తాళ్లపూసపల్లి చెరువుకు చేరుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని మత్తడి ద్వారా పాకాల ఏరుకు మళ్లించి పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.