నర్సింహులపేట, సెప్టెంబర్ 23 : యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పెట్టుబడి అధికంగా పెట్టినప్పటికీ పూత, కాత త క్కువగా ఉండడంతో దిగుబడి అంతంత మాత్రంగానే ఉండి ఆర్థిక నష్టం వచ్చేలా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతివృష్టి, అనావృష్టికి తోడు తెగుళ్లు అధికమై పంటలు పాడైపోతున్నాయి. ఎర్రబారుతున్న పత్తి పంటను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గతేడాది పత్తి పంటలు దెబ్బతినడంతో ఈసారి మంచి దిగుబడి, ధర వస్తుందని ఆశించిన రైతులు అధిక మొత్తంలో పంటను సాగు చేశారు. వరుణుడు కరుణించకపోవడంతో అలస్యంగా పంట సాగు చేశారు.
ఆ త ర్వాత కురిసిన అధిక వర్షాలు రైతులను నిండా ముంచాయి. సీజన్ మొదట్లో రెండుసార్లు విత్తనాలు నాటడంతో ఖర్చులు అధికమయ్యాయి. ఎకరానికి కనీ సం 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించామని, కానీ 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చేలా ఉందని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు కనీసం పంటలకు వచ్చే చీడపీడలపై అవగాహన కల్పించలేదని, పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయి అప్పుల పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పంటకు మార్కెట్లో ధర ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పంటను వదిలిపెట్టిన
సీజన్ మొదట్లో వానలు లేక పత్తి సరిగా మొలవలేదు. రెండుసార్లు పత్తి గింజలు పెట్టిన. ఆ తర్వాత వచ్చిన వానలకు పత్తి ఎర్రబారింది. కలుపు తీసుడుకు, దున్నుడుకు రూ. 40 వేల వరకు పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు పత్తి ఎర్రబారి పెట్టుబడిలో సగం కూడా వచ్చేటట్లు లేదు. చేసేదేమీ లేక పత్తి పంటను వదిలిపెట్టిన.
– చుక్క నరేశ్, రైతు, జయపురం