విలీనం.. అవినీతి కథ
సాధారణంగా సిబ్బంది అవినీతి చేస్తే అధికారి చర్య తీసుకుంటారు.. అధికారి అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికారులు స్పందించి వేటు వేస్తారు.. చివరకు అందరూ మిలాఖతై ప్రజల సొమ్మును దండుకుంటే విజిలెన్స్ విభాగం అక్రమాల గుట్టు తేలుస్తుంది..కానీ బడంగ్‌పేట కార్పొరేషన్ అవినీతి కథ వీటన్నింటికి మించి!! పుట్టగొడుగుల్లా అక్రమాల పరంపర వెలుగులోకి వచ్చినా హడావిడి చేసిన విజి‘లెన్స్’ సైతం చివరకు కళ్లు మూసుకుంది. సీఎంవో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు జోనల్‌స్థాయి అధికారుల వరకు వరుస ఫిర్యాదులు వెళ్లినా కించిత్తు చలనం లేదు. దీంతో రెచ్చిపోయిన అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించి ఫిర్యాదుదారులు, మీడియాపైనా ఎదురు దాడి మొదలుపెట్టారు. కానీ పాపం పండింది.. కాంట్రాక్టర్లు-అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టిన వ్యవహారంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఒకటి అరా కాదు! కార్యాలయంలో కమిషనర్ సహా యంత్రాంగాన్ని దిగ్బంధించి ఏకంగా పది గంటలకు పైగా విచారణ చేయడంతో ప్రాథమికంగానే విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరి.. కథ కంచికి చేరి ప్రజల సొమ్మును ఫలహారంగా పంచుకున్న వాళ్లపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది ఒక ఎత్తయితే… ఇన్నాళ్లూ ఆధారాలతో సహా ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారుల నుంచి విజిలెన్స్ వరకు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు? అనేది కీలకమైన ప్రశ్న. ఇంతకీ… అక్రమార్కులకు అండగా నిలుస్తున్న ఆ అదృశ్య ‘హస్తం’ ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు విశృంఖలంగా చేసిన ఈ అక్రమాల అంతు తేల్చకపోతే అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లేననేది జనం మాట.
– సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీన ప్రక్రియ కొందరు అవినీతి అధికారులకు కాసులు కురిపించిందనడంలో సందేహం లేదు. విలీన ఉత్తర్వులు వెలువడిందే తడవుగా రోజుల వ్యవధిలోనే ఇల్లు చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు-అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవతవకలకు పాల్పడ్డారు. ప్రధానంగా నిర్మాణ అనుమతులు, ఓసీ జారీల్లో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవినీతి రాజ్యమేలినట్లు ఆధారాలతో సహా అవినీతి బయటికొచ్చింది. దీంతో వీటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కానీ ఆదిలో హడావిడి చేసిన విజిలెన్స్ ఒక్కసారిగా అవినీతి దస్ర్తాలన్నింటిని అటకెక్కించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిలో తమదైన ముద్రను వేసుకుని ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురి చేసింది.
ఒకటి అరా కాదు.. గతంలో చేసిన పనులు.. చేయని పనులు.. కొద్దిగా చేసిన పనులకు అధిక మొత్తం.. ఇలా ఏకంగా రెండు వేలకు పైగా పనులను ప్రతిపాదించిన కార్పొరేషన్ అధికారులు రూ.122 కోట్లకు టెండర్ వేశారు. ఈ దస్త్రం కాస్తా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి రావడంతో అవినీతి గుట్టు బట్టబయలైంది. మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల్లో తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు దోచుకుతిన్నారనేది పనుల ప్రతిపాదనల తీరు, అంచనా విలువల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇదే సమయంలో ఈ అవినీతిపై ఉన్నతాధికారులతో పాటు పలు విచారణ సంస్థలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆదిలోనే ‘నమస్తే తెలంగాణ’ ఈ అవినీతిపై వరుస కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బడంగ్‌పేట సహా విలీనమైన 27 స్థానిక సంస్థల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతామంటూ విజిలెన్స్ హడావిడి చేసింది. శంషాబాద్, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట, తదితర స్థానిక సంస్థల్లో విచారణ చేసి పలు దస్ర్తాలను తీసుకుపోయారు. కానీ రోజుల వ్యవధిలోనే ఆ విచారణ అటకెక్కింది.
12 గంటల పాటు విచారణ..
బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు మొదలైన ఏసీబీ విచారణ రాత్రి వరకు కొనసాగింది. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో 15 మంది ఏసీబీ అధికారులు 12 గంటల పాటు విచారించారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాలకు సంబంధించిన దస్ర్తాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. ఫిర్యాదు దారులను కూడా పిలిపించిన ఏసీబీ అధికారులు వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. టెండర్ల విధానంలో కాకుండా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల విలువైన పనుల్ని చిన్న చిన్న పార్టులుగా విభజించి నామినేషన్ ప్రక్రియన కేటాయించినట్లు గుర్తించారు. ఇందులో చేసిన పనులు..ఒకటే పనులకు రెండు, మూడు పర్యాయాలు బిల్లులు ఇలా అనేక రూపాల్లో అవినీతికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తున్నది.
వాటికి సంబంధించిన కాపీలను సేకరించిన అధికారులు ఇంజినీరింగ్ విభాగం వారితో సాంకేతికంగా పరిశీలన చేసి పూర్తి వివరాలు నివేదిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ కీలక విషమేందంటే.. విజిలెన్స్ అధికారుల నుంచి కూడా ఏసీబీ అధికారులు వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన విజిలెన్స్ విచారణ ఎంతవరకు వచ్చింది? ఏం గుర్తించారు? వంటి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. గతంలో సర్పంచ్‌లు ఇచ్చిన లే అవుట్లు చెల్లవని తెలిసినా పర్మిషన్లు ఇవ్వడం, 49 అక్రమ నిర్మాణాలను గుర్తించినప్పటికీ నోటీసులు ఇవ్వకపోవడం, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాల్సి ఉన్నా వాటిని పెండింగులో ఉంచడం వంటి వివరాలపైనా విచారణ చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అవినీతిపై ఏం తేలుస్తారు? ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇదే సమయంలో బడంగ్‌పేట కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఆరా తీస్తుండటం గమనార్హం. ప్రధానంగా గత ఏడాదిన్నర, రెండేళ్లలో ఒకటి రెండు కాదు. కేవలం ప్రభుత్వ భూముల్లో 1600 ఇండ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ విభాగం దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు అదనంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లోనూ నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లుగా గుర్తించిన ఇంటెలిజెన్స్ రెవెన్యూ అధికారులను సైతం వాకబు చేసినట్లు సమాచారం.

అధికార పార్టీ నేతల అండతోనే..!
విజిలెన్స్ విచారణతో అక్రమార్కుల్లో కాస్త గుబులు పుట్టినప్పటికీ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి అండగా నిలువడంతో విచారణ కాస్తా అటకెక్కినట్లు ఆరోపణలున్నాయి. అసలు ఆది నుంచి విజిలెన్స్ విచారణ కొసలెల్ల అక్రమార్కుల పని పడుతుందా? అనే అనుమానాలే వ్యక్తమయ్యాయి. వాటికి బలాన్ని చేకూర్చేలా విజిలెన్స్ అధికారులు అవినీతి ఆనవాళ్లను గుర్తించకపోగా కించిత్తు చర్యలకు కూడా సిఫార్సు చేయలేదు. ఇక్కడే అవినీతి అధికారులకు కొండంత బలం వచ్చినట్లయింది.
ప్రధానంగా అధికార పార్టీ నేతలు తమ పరపతిని వినియోగించడంతో జోనల్ స్థాయి ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు సైతం అన్నీ తెలిసినా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. దీంతో ఒకవైపు ఫిర్యాదు దారులు మరోవైపు మీడియాపై ఎదురు దాడి మొదలుపెట్టారు. ఉల్టా చోర్ కోత్వాల్ ఖో డాంటే అన్నట్లు చివరకు ఉద్యోగ నేతలను వెంట బెట్టుకొని ఎదురు దాడికి దిగారు. తమనెవరూ ఏమీ చేయలేరంటూ అక్రమార్కులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదే సమయంలో రెండు రోజుల కిందట అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగడంతో ఇప్పటికైనా అవినీతి కథ కంచికి చేరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది.