పాలకుర్తి, ఏప్రిల్ 17 : జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ దవాఖాన (సీహెచ్‌సీ) వైద్యుల నిర్లక్ష్యంతో బుధవారం సాయం త్రం గర్భస్థ శిశువు మృతి చెందింది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ఏ మల్లికార్జున్‌రావు గురువారం విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నా రు. బాధ్యులైన వైద్య సిబ్బంది, డాక్టర్లపై చర్యల కోసం కలెక్టర్‌కు నివేదిక అందజేయగా, గైనకాలజిస్టు డాక్టర్ అపర్ణను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
అలాగే, విధులకు గైర్హాజరవుతున్న సూపరింటెండెంట్ పరమేశ్వరి సస్పెన్షన్ కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారుసు చేశారని పేర్కొన్నారు. వీరితో పాటు ప్రసవం సమయంలో విధుల్లో ఉన్న డూటీ డాక్టర్ స్వప్నతో పాటు గర్భిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్టాఫ్‌నర్స్ నీల, ఏఎన్ఎం కే కృష్ణవేణికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. విధులకు హాజరు కాని డాక్టర్ భరత్‌ను విధుల్లో నుంచి తొలగించినట్లు డీఎంహెచ్‌వో వివరించారు. కాగా, బుధవారం రాత్రి ఆస్పత్రి ఎదుట బీఆర్ఎస్తోపాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పసికందు తండ్రి యాట భిక్షపతి ఫిర్యాదు మేరకు బాధ్యులైన డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్ హామీతో సమస్య సద్దుమణిగింది. పసికందు మృతదేహాన్ని జనగామ తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
కాగా, గురువారం మండలంలోని లక్ష్మీనారాయణపురంలో పసికందు మృతదేహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కు టుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి చెందడం బాధాకరమన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ దవాఖానను 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసి నిధులు మం జూరు చేశానన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు డాక్టర్లను నియమించకపోవడంపై మండిపడ్డారు.
పసికందు మృతి ప్రభుత్వ హత్యగా భావించాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, తాజా మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బొడిగే ప్రదీప్, శ్రీకాంత్ ఉన్నారు. కాగా, బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ఫోన్లో పరామర్శించారు.