సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి శుక్రవారం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రూ.8 కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల గోదాములను ప్రారంభించి, రైతులకు రూ.37.50 కోట్ల పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. గిర్నిబావి, చలపర్తిలో రూ. 38 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకూ తాగు, సాగు నీరు అందుతోందని తెలిపారు.
– దుగ్గొండి, మే 12
దుగ్గొండి, మే 12 : అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ తెలంగాణ రాష్ట్రం అని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రజ లు సుఖసంతోషాలతో ఉన్నారని వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. రూ.15కోట్లతో మండలంలోని గిర్నిబావి- దుగ్గొండి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, చలపర్తి గ్రామంలో రూ.8కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం చలపర్తి గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో 36లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండగా స్వరాష్ట్రంలో వాటిని 74 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచిన ఘనత కేసీఆర్‌దన్నారు. రైతుబంధు పథకంతో పంట పచ్చగా ఉంది, రైతు బీమాతో రైతు కుటుంబం భరోసాతో బతుకుతున్నదని చెప్పారు. ఈ పథకాల గురించి ఐక్యరాజ్య సమితిలో చర్చకు వచ్చినట్లు తెలిపారు. రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో భూముల విలువలు గణనీయం గా పెరిగాయన్నారు.
రైతు బాంధవుడిగా, రైతుల కష్టా లు తెలిసిన నాయకుడు కేసీఆర్ రైతును రాజు చేయాలనే సంకల్పంతోనే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధా న్యం ఇస్తున్నారన్నారు. అకాలవర్షంతో నష్టపోయిన పంటలను వెంటనే పరిశీలించి ఎకరాకు రూ.10వేలు అందించి రైతులకు ధైర్యం చెప్పారని తెలిపారు. రైతు బంధుకు రూ.65వేల కోట్లు, రైతుబీమాకు రూ.5వేల కోట్లు, సాగునీటికి రూ.1.59లక్షల కోట్లు, మక్కల కొనుగోలుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతులు, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన : మంత్రి ఎర్రబెల్లి
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చలపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి రూ.23కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు రైతులకు రూ.37.50 కోట్ల పంట నష్ట పరిహారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతానికి సైతం తాగు, సాగునీరు అందుతోందన్నారు. అకాల వర్షాలతో పంట లు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నర్సంపేట నియోజకవర్గానికి రూ.37కోట్ల పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలో పంట నిల్వలకు సరిపడా గోదాములు ఉన్నాయని వివరించారు. నూతన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి జిల్లాలోనే నర్సంపేటకు అత్యధిక నిధులు మంజూరు చేయించుకున్న ఘనత మీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శరెడ్డి అని అన్నారు.
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే పెద్ది
ప్రజలు ఇచ్చిన అవకాశం, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దుగ్గొండి మండలంలో 90శాతం రోడ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. మండుటెండల్లో చెరువులను మత్తడి దుంకించిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ కాల్వల నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలంగా మార్చారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా తాగు నీరు అందించి, మే నెలలో కాల్వల ద్వారా చెరువుల్లో నీళ్లు నింపి మత్తడి దుంకించిన రైతు నాయకుడు కేసీఆర్ అన్నారు.
ప్రజలంతా బాసటగా నిలిచి మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్‌ను చూడాలన్నారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు అశ్వినీతానాజీవాకడె, శ్రీవత్స కోట, ఓడీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళి, వరంగల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, ఎన్నారై రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, చలపర్తి సర్పంచ్ ముదురుకోల శారద, ఎంపీటీసీ రంపీస సోనీరతన్, దుగ్గొండి, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.