ఇనుగుర్తి, మే 5 : ‘చుట్టూ పరదాలు కట్టుకొని, పైన రేకులు వేసుకొని భార్యా పిల్లలతో నివసిస్తున్నా.. వర్షాకాలం నీళ్లతో, రాత్రిపూట పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా.. నాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోండి సారూ’ అంటూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారానికి చెందిన ఓ దివ్యాంగుడు కలెక్టర్‌ను వేడుకుంటున్నాడు.
ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అర్జీని సమర్పించాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు చెడుపాక లక్ష్మణ్ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడికి అన్ని అర్హతలున్నా అధికారులు మాత్రం ఇల్లు మంజూరు చేయలేదు. దీంతో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకొని అదనపు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యవసాయ భూములు, ఆర్థికంగా బలంగా ఉన్న వారి పేర్లు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లలో తమకు 5 శాతం కేటాయిస్తానని హామీ ఇచ్చారని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తనకు గుంట భూమి లేదని, నెల నెలా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. కలెక్టర్ తనకు ఇల్లు కేటాయించి ఆదుకోవాలని లక్ష్మణ్ కోరాడు.