జనగామ, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. తహసీల్దార్ కార్యాలయాలనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ధర(ణి)హాసంతో ఆనందంగా ఇంటిదారి పడుతున్నాడు. జనగామ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలల్లో రోజూ నిరాటంకంగా ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు తాత ముత్తాతల నుంచి ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ కంటి ముందు కనిపించే తన భూమికి హక్కు పత్రాలు కావాలని రైతులు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే లేడు. విసిగి వేసారి చేయి తడిపితే తప్ప ఫైలు కదపని అధికారులు, మళ్లీ హక్కు పత్రం కోసం కొర్రీలతో పెట్టే ముప్పుతిప్పలతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. భూమి హక్కులపై సవాలక్ష సమస్యలను సాకుగా చూపి లేనిపోని భయాలు కల్పించి రైతుల నుంచి లంచాలు వసూలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే ఎకరానికి ఇంత అని బేరమాడేవారు. విలువైన భూములకు రూ.లక్షల్లో చేతులు మారిన సందర్భాలున్నాయి.
ధరణి వచ్చిన తర్వాత రైతుల కష్టాలన్నీ మాయమయ్యాయి. వ్యయ ప్రయాసాలు లేకుండా నిర్దేశించిన ధరకే పారదర్శకంగా భూ యాజమాన్య హక్కులు దక్కుతున్నాయి. పోర్టల్ ప్రారంభమైన 2020 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 58,717 స్లాట్లు బుక్ చేసుకుంటే వివిధ కారణాలతో 937 స్లాట్లు పెండింగ్‌లో ఉండగా, 57,684 రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, జనగామ, లింగాలఘనపురం, నర్మెట, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో మొత్తం 37,649 స్లాట్లు నమోదు కాగా, 732 పెండింగ్‌లో ఉండగా అందులో 36,917 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, పాలకుర్తి, జఫర్‌గఢ్ మండలాల పరిధిలో 21,068 స్లాట్లు నమోదు కాగా, 205 పెండింగ్‌లో ఉంటే 20,767 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
రైతులకు భరోసా..
భూముల అమ్మకాలు, కొనుగోలు, ఆస్తుల బదలాయింపు, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అక్రమాలకు తావులేకుండా ప్రజల స్థిరాస్తులకు మరింత భద్రత కల్పించడం సహా జవాబుదారీతనాన్ని పెంచేలా ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతుల్లో భరోసా నింపింది. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బదలాయింపు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుత్నుది. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల అనంతరం మ్యుటేషన్ (ఆస్తుల బదలాయింపు) అధికారాన్ని ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించడంతో తమకు తిరుగుడు తిప్పలు తప్పినట్లయిందని రైతులు సంబుర పడుతున్నారు. క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చిన్న తప్పిదం దొర్లినా దొరికిపోయేలా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్లకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్థిక భారం తప్పింది : గాదారి రేణుక, ముత్తారం
పాలకుర్తి, మే 29: రిజిస్ట్రేషన్ చాలా తొందరగా అయింది. తహసీల్దార్ కార్యాలయానికి పోయిన తర్వాత అలా కూర్చున్నామో లేదో టోకెన్ నెంబర్ ప్రకారం వెంటనే పేరు పిలిచారు. వచ్చిన తక్కువ సమయంలోనే పని అయిపోయింది. భూమి హక్కులు నా పేరున బదిలీ అయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చాలా త్వరగా జరిగింది. ఇదివరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తిరుగాల్సి వచ్చేది. రోజంతా పడిగాపులు కాసేది. ఇప్పుడు ఒక్క రోజులోనే రికార్డులన్నీ బదిలీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ఎంతో మేలైంది. రూపాయి ఖర్చు లేదు.
అవినీతికి అడ్డుకట్ట..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా..వేగంగా పూర్తవుతుండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు, దళారీ వ్యవస్థకు తావులేకుండా అవినీతికి అడ్డుకట్ట వేస్తూ పూర్తి పారదర్శకతో పట్టా అందుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి కుటుంబ సభ్యులు, సాక్షులతో వచ్చిన 20 నిమిషాల్లోనే ఫొటోలు, వేలిముద్ర, సంతకాలు తీసుకొని గంట వ్యవధిలోనే పాస్ పుస్తకంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్, కొనుగోలు చేసిన వారి పేరిట వివరాలు నమోదవుతున్నాయి. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ త్వరగా పూర్తవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వ్యయప్రయాసలు
వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు, ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్లు అన్నీ ఒకే చోట చేయాల్సి రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కువ రద్దీగా కనిపించేవి. స్లాట్ బుక్ చేశాక రిజిస్ట్రేషన్‌కు వారం, పదిరోజులు అంతకంటే ఎక్కువ రోజులు పట్టేది. ధ్రువీకరణ పత్రాల్లో అక్షర దోషాలు, తప్పులు పడితే మరిన్ని ఎక్కువ రోజులు పట్టేది. పత్రాలను సరిచేసుకొని వచ్చినా ఒకటి, రెండు రోజులు తిరిగితే గానీ రిజిస్ట్రేషన్ కాకపోయేది. డాక్యుమెంట్ రైటర్ మొదలు అధికారులు, కింది స్థాయి సిబ్బంది వరకు కాసులు ఇస్తేనే పనయ్యేది. ఇక బస్సులు, వాహన చార్జీలు, రాత్రికి దావత్ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. డాక్యుమెంట్లు ఇచ్చి పైసలు ముట్టజెప్పినా నెల, రెండు నెలల తర్వాత మ్యుటేషన్ అయ్యేది. తర్వాత మరో నెలరోజులకు పాస్ పుస్తకం వచ్చేది.
రూ.200తో స్లాట్ బుకింగ్..
ఐటీశాఖ ఉత్తర్వుల మేరకు ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం కేవలం రూ.200 యూజర్ చార్జీ చెల్లించి మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చెల్లించి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యూజర్ చార్జీ కింద రూ.200 చెల్లించడం సహా స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం 10పేజీల ప్రింట్లకు ఇదే ధర వర్తిస్తుంది. 10పేజీలు దాటితే ప్రతి పేజీకి రూ.5 అదనంగా చెల్లించడం సహా ఎకరానికి రూ.2,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత పోస్టల్ లేదా కొరియర్ ద్వారా పాసుబుక్ నేరుగా కొనుగోలు చేసిన వారి ఇంటికే వచ్చేందుకు రూ.300 చెల్లించాలి. రైతుల కష్టాలను దూరం చేసేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం కనిపిస్తుండడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నది. మీ సేవ కేంద్రాల్లో రైతుల నుంచి అధిక ఫీజు వసూలు చేయకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. స్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ రసీదులు ఇస్తున్నారు.
కష్టాలు తప్పినయ్
లింగాలఘనపురం : ధరణి లేనప్పుడు భూమి కొన్న వాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్‌కు, పాసు పుస్తకం కోసం అష్టకష్టాలు పడేవాళ్లు. నేను 21గుంటల భూమి కొనుగోలు చేసి, లింగాలఘనపురం తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించా. అదేరోజు నాకు భూమి కొనుగోలుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చారు. పాసుపుస్తకాన్ని పోస్టు ద్వారా ఐదు రోజుల్లోపే పంపించారు. ధరణితో రైతుల్లో ధీమా పెరుగుతోంది.
– ఎడ్ల తిరుపతి, లింగాలఘనపురం
రైతులకు భరోసా
దేవరుప్పుల, మే 29 : తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక నీళ్లు పుష్కలం కావడంతో వ్యవసాయం పెరిగింది. కేసీఆర్ అన్ని సౌలతులు చేసిండు. ఒకప్పుడు వ్యవసాయదారునికి పిల్లనియ్యాలంటే భయపడేది. ఇయాల రైతు రాజు కావడం వల్ల పిల్లనివ్వడానికి ముందుకొస్తున్నారు. రైతులు పంటలు పండిస్తే ఇంటికి ధాన్యరాసులు. అక్కెరకు భూములు అమ్మితే ఇంటికి ధనరాసులు వస్తున్నాయి. వలసలు ఆగినయ్. వ్యవసాయం దండుగ అన్న రోజులుపోయి పండుగ అనేటట్టు చేశిండు కేసీఆర్ సార్. భూములకు డిమాండ్ పెరిగింది. సాఫ్ట్వేర్ నౌకరోళ్లు ఊళ్లళ్లకొచ్చి వ్యవసాయాలు చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ రైతులకిచ్చిన భరోసా. ధరణి వల్ల రైతులకు కలిగిన నమ్మకం.
– వంగాల సంజీవరెడ్డి, రైతు, సింగరాజుపల్లి
అవినీతికి ఆస్కారం లేదు
జనగామ చౌరస్తా, మే 29 : మాకు వెంకిర్యాలలో 3.15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇదివరకు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దళారుల దగ్గరికి పోయేది. ధరణి వచ్చిన తర్వాత రైతులందరం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నరు. దీని వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. రైతులకు మేలే జరిగింది. ప్రతిసారి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగకుండా మన స్మార్ట్‌ఫోన్‌లోని ధరణి యాప్ ద్వారా ఎప్పుడంటే అప్పడు మన భూమి వివరాలు, పహాణీలు పొందే సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది.
– దండెబోయిన రాజ్‌కుమార్, యువరైతు, జనగామ
రిజిస్ట్రేషన్ వెంటనే అయ్యింది
బచ్చన్నపేట : మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాయిన పేరు మీదు ఉన్న జాగ మా ముగ్గురి పేర రిజిస్ట్రేషన్ చేయించారు. ముందుగా ఒక రోజు స్లాట్ బుక్ చేసుకున్నం. మరుసటి రోజు తహసీల్ ఆఫీసుకు పోయినం. ఆ తర్వాత మమ్ముల్ని కార్యాలయంలోకి పిలిచారు. ఒక్కొక్కరికి 30 గుంటల చొప్పున భూమి పత్రాలను తహసీల్దార్ పరిశీలించారు. వెంటనే ఫొటో దించారు. ఇద్దరు సాక్షుల సంతకం తీసుకున్నరు. నిమిషాల్లో మా నాయిన నుంచి గిఫ్ట్ పేర భూమి మా పేర బదలాయింపు అయినట్లు హక్కు పత్రాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సార్ తెచ్చిన ధరణితో ఒకనాడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు లేవు. అప్పుడు చేర్యాలకు, తర్వాత జనగామకు పోయేది. ఇప్పుడా బాధలు తప్పినయ్. మండల కేంద్రంలోనే చకాచకా పనులు అవుతున్నయ్. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సర్కార్ పెట్టిన ధరణి బాగుంది.
– దాసారం వెంకటేశ్, ఆలింపూర్, బచ్చన్నపేట
భూముల రిజిస్ట్రేషన్ సులువు
రఘునాథపల్లి : ధరణి వచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ సులువైంది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు చాలా ఆవస్థలు పడేది. రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గరకు వెళ్లి కొనుగోలు చేసిన తర్వాత మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేది. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజు క్రయవిక్రయదారులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు వేయగానే బ్యాంకింగ్ సేవల తరహాలో విక్రయించిన వ్యక్తి ఖాతాలో నుంచి భూమి తొలగిపోయి కొనుగోలు చేసిన వ్యక్తి ఖాతాలోకి భూమి జమవుతుంది. కొనుగోలు చేసిన వ్యక్తి పేరు వెంటనే ఆన్‌లైన్‌లోకి నమోదై సదరు రైతు పేరిట ఈ పాస్‌బుక్ జారీ అవుతుంది. భూములకు సంబంధించి 33 మాడ్యూల్స్‌లో కొత్త ఆప్షన్స్ ధరణిలో ఉంచారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ తీసుకురావడం గొప్ప విషయం. సమాచారం గోప్యంగా, భద్రంగా ఉంటుంది.
– గంగసాని అరవిందరెడ్డి, గబ్బెట, రఘునాథపల్లి
రైతులకు ఎంతో మేలు
నర్మెట, మే 29: ధరణి పోర్టల్‌తో మాలాంటి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ల కోసం జనగామ, చేర్యాల పట్టణాలకు వెళ్లేవాళ్లం. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడికక్కడే మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నాలా కన్వర్షన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసిన వెంటనే తహసీల్ కార్యాలయంలో పనులు అయిపోయాయి. ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– కందుల కరుణ, మరియపురం, తరిగొప్పుల మండలం