తాడ్వాయి, జనవరి 18 : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఫిబ్రవరిలో మహా జాతర జరుగనుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. గురువా రం రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ర్టాల నుంచి భక్తులు మేడారానికి వచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, కల్యాణకట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు. తల్లులకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, సారెను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో జాతర పరిసరాలు రద్దీగా మారుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన దారం కోటిరెడ్డి అమ్మవార్ల ప్రతిరూపమైన వెండి కుంకుమ భరిణెలను రూ.16 వేలతో తయారు చేయించి గురువారం తల్లులకు సమర్పించారు. దర్శనం అనంతరం దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జ్ఞానేశ్వర్, మధుకర్‌కు అప్పగించారు.
జాతర పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ విధులు నిర్వర్తించేందుకు గురువారం పంచాయతీ కార్యదర్శులకు ఎంపీవోలు శ్రీధర్, కుమార్, శ్రీనివాస్ విధులు కేటాయించారు. సుమారు 150 మంది కార్యదర్శులను 10 సెక్టార్లలో కేటాయించారు. భక్తులు ముందస్తుగా తరలివస్తుండడంతో డీపీవో వెంకయ్య ఆదేశాల మేరకు వారికి విధులు అప్పగించారు. ఒక్కో సెక్టార్‌కు 10 మంది పారిశుధ్య కార్మికులను నియమించి పనులను నిర్వహించనున్నారు.
మేడారంలో అక్రమంగా దు కాణాలు ఏర్పాటు చేసుకున్న వారు వెంటనే షాపులను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి కొర్నిబెల్లి సతీశ్‌కుమార్ వ్యాపారులకు గురువారం నోటీసులు అందజేశారు. అమ్మవార్ల గద్దెల ఎదురుగా, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం చుట్టు పక్కల రోడ్డును ఆనుకుని వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న వారు మూడు రోజుల్లో షాపులను తొలగించాలని సూ చించారు. రద్దీ పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో బాగంగా షాపులను తొలగించాలని నోటీసులను అందజేశారు. ప్లాస్టిక్ వినియోగించినట్లు తెలిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.