చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన స్మార్ట్‌సిటీ పథకం భవితవ్యం గందరగోళంలో పడింది. జూన్ 30తో ఈ పథకం అమలు గడువు ముగుస్తుండగా కేంద్రం పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులు సగం మాత్రమే పూర్తి కాగా, మేజర్ ప్రాజెక్ట్‌లు అసంపూర్తిగానే ఉన్నాయి. మరో ఏడాది పాటు ఈ పథకాన్ని పొడిగించకుంటే అన్నీ మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తేనే కేంద్రం గడువు పొడిగించే అవకాశం ఉంటుంది.
వరంగల్ నగరానికి స్మార్ట్‌సిటీ పథకం గడువును మరో ఏడాది పొడిగించేందుకు కృషి చేయాలని గ్రేటర్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం పొడిగింపు ఇవ్వకుంటే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, ఇంకా ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది. స్మార్ట్‌సిటీ పథకం కింద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.948 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటివరకు కేంద్రం రూ.528 కోట్లు విడుదల చేసింది. రూ.505 కోట్లు ఖర్చు చేయగా, రూ.23 కోట్లు కార్పొరేషన్ వద్ద నిల్వ ఉన్నాయి. వారం రోజులక్రితం కేంద్రప్రభుత్వం రూ.56 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.56 కోట్లు విడుదల చేస్తే రూ.112 కోట్లు గ్రేటర్ ఖజానాకు చేరుతాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 77 అభివృద్ధి పనులు చేపట్టారు. అవి నత్తనడకన సాగుతున్నా యి. ఇప్పటికి సగం మాత్రమే పూర్తయ్యాయి. మేజర్ ప్రాజెక్ట్‌లు అసంపూర్తిగానే ఉన్నాయి. నగరానికి వన్నె తెచ్చే మేజర్ ప్రాజెక్ట్‌లన్నీ స్మార్ట్‌సిటీ నిధులతోనే చేపట్టారు. మరో ఏడాది స్మార్ట్‌సిటీ పథకాన్ని పొడిగించకుంటే అన్నీ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది.
స్మార్ట్‌సిటీలో భాగంగా కేంద్రం వాటా 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, ఆయా మున్సిపల్ కార్పొరేషన్ వాటా 25శాతం భరించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌ది కలిపి 50శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. స్మార్ట్‌సిటీ పథకం గడువు జూన్ 30న ముగుస్తున్నది. కేంద్రం పొడిగింపునకు అవకాశం కల్పిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు విడుదల చేస్తాయి. పొడిగించకుంటే కేంద్రం నిధులు ఆగిపోతాయి. అప్పుడు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నవి పూర్తయ్యేందుకు రూ.400 కోట్లు కావాలి. ఆధునిక సాంకేతికతతో రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.70 కోట్లతో చేపట్టిన భద్రకాళీ బండ్ రెండో దశ సుందరీకరణ పనులు సగమే పూర్తయ్యాయి. వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, బయోమైనింగ్ పనులు సైతం స్మార్ట్‌సిటీ పథకంలోనే చేపట్టారు. నగర ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్, భద్రకాళీ, వడ్డేపల్లి బండ్ల సుందరీకరణ, ఎస్టీపీ, నగరం నలువై పులా జాతీయ రహదారులపై గ్రాండ్ ఎంట్రెన్స్ పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తేనే స్మార్ట్ సిటీ పథకం గడువు పొడిగింపు ఉంటుంది. పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.