స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 2 : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వలేని బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతూ తెలంగాణకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ.16.86 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కడియం శ్రీహరి అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ ఇటు కేంద్రానికి, పొరుగు రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణకు వస్తున్న ఆవార్డులను చూసి జీర్ణించుకోలేని బీజేపి , కాంగ్రెస్ పార్టీలు విషం గక్కుతున్నాయని కడియం శ్రీహరి విమర్శించారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రిని సభ్యత లేకుండా దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంపై విపక్షాలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని, సమస్యలుంటే ఎత్తిచూపాలి తప్ప వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ నాయకులపై ఏక వచనంతో విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల కోసం పథకాలు
2014లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేశారని కడియం శ్రీహరి వివరించారు. 2018లో రెండోసారి రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపి, ఇప్పటి వరకు 5 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 400 కోట్ల వరకు మాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో రూ.లక్ష వరకున్న రుణాలు మాఫీ చేస్తారని తెలిపారు. రైతులను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామని, ఇందుకోసం ప్రతి సంవత్సరం డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. దీంతో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు. రైతుబీమా పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు లక్ష కుంటుంబాలకు రూ.5 వేల కోట్లు అందించామని, రైతుబంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్, రేవంత్‌రెడ్డి మాటలు, ప్రవర్తన దరిద్రంగా ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికైనా వారు తమ పద్ధతి, భాష మార్చుకోవాలని హితవు పలికారు.
సంక్షేమానికి సర్కారు పెద్దపీట..
ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళితబంధు పథకం అమలు చేస్తూ లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందిస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గానికి 1100 యూనిట్లను మంజూరు చేస్తున్నారని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందో బండి సంజయ్, రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని, దళితుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. దళితుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కడియం అన్నారు. ఈ నెల 14న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందిస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో బంజార భవనం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.
అధిష్ఠానం ఆదేశాలు పాటించాలి
బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి ఒక్కరూ అధిష్ఠానం ఆదేశాలను పాటించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నాయకత్వం మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటించడం లేదన్నారు. నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజయ్య గెలుపు కోసం రెండుసార్లు కృషి చేశానన్నారు. బహిరంగ సభలకు మాత్రమే తనను ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్ నాయక్, నీల గట్టయ్య, రాంబాబు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నెపు అశోక్, సర్పంచ్ల ఫోరం స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, సర్పంచ్‌లు కోతిరేణుకా రాములు, నగరబోయిన మణెమ్మాయాదగిరి, మ ల్లేశం, అయోధ్య, మల్లేశం, స్వామినాయక్, జనగాం యాదగిరి, పేరాల సుధాకర్, ఫాతికుమార్, రవి పాల్గొన్నారు.