జనగామ, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు దేవాదుల 3వ ఫేస్ పంపింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్‌పల్లి, గండిరామారం, బొమ్మకూ రు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్ రిజర్వాయర్లను నింపి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సింది ఉంది. అయితే, సీజన్ ప్రారంభమై వరినాట్లు అయిపోయాయి.
అదనులో నీళ్ల కోసం రైతుల తండ్లాడుతుంటే.., పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో దేవాదుల నీటి విడుదల కోసం ఎమ్మె ల్యే పల్లా పలుమార్లు అధికారులను నిలదీశారు. తాను ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడితోనే దేవన్నపేట నుంచి ధర్మసాగర్‌కు వచ్చే థర్డ్ ఫేస్ పం పింగ్‌కు ఈనెల 19(బుధవారం) రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోటర్లను ఆన్ చేయనున్నారని సోమవారం రాత్రి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 60 రోజుల్లో కేవలం 40 రోజులు మాత్రమే పంపులు నడపడం శోచనీయమని, 34రోజుల పాటు ఎస్టీఎమ్లు సమ్మె చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
దీనివల్ల ము ఖ్యంగా జనగామ నియోజకవర్గంలోని దేవాదుల ఆయకట్టులో ఉన్న భూములు 50శాతం పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రైతులు సాగునీటి స మస్యలు చెబుతుంటే గత నెలరోజులుగా ఇరిగేషన్ ఏఈ, డీఈ, ఎస్ఈ, సీఈ, ఈఎన్సీ నుంచి నీటిపారుదలశాఖ సెక్రటరీ, మంత్రి దృష్టికి తీసుకెళ్లి నెత్తీనోరు కొట్టుకుంటున్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అన్ని పంపులను బంద్ చేశారని పల్లా అన్నారు.
చివరికి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విన్నవిం చా.. ముఖ్యమంత్రి స్టేషన్‌ఘన్‌పూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా పంపులు ఆన్ చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇప్పుటికైనా 3వ ఫేస్ ఆన్ చేయడంతోపాటు ధర్మసాగర్ నుంచి గండిరామారం వరకు ఉన్న నాలుగు పంపులు ఆన్ చేయాలని, వెంటనే అన్ని పంపులను, మోటర్లను ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులను నింపి మిగిలిన పంటలను కాపాడాలని, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని రైతుల తరఫున కోరుతున్నా..లేకుంటే రైతులతో నిరసన కార్యక్రమాలను చేపడుతామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.