హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18: ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం గౌడ్ తెలిపారు. వేసవికాలం నేపథ్యంలో అన్ని వసతులు ఉన్న పాఠశాలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ప్రత్యేక సబ్జెక్టుల ( మైనర్ మీడియా) విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులకి హాల్ టికెట్లు జారీ చేశామని, ఇంకా పొందని వారు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు మాస్ కాఫీయింగ్ పాల్పడితే చట్టారీత్య చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బందికి సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించిన సందేహాలు ఉంటే స్టడీ సెంటర్ల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా నుంచి పదోతరగతి, ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొత్తం 10వ తరగతి విద్యార్థులు 2,679 మంది, ఇంటర్ విద్యార్థులు 4,707 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. వీరి కోసం మొత్తం 34 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి 34 మంది C. S లు, 35 మంది D. O. లు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 35 సిట్టింగ్ స్పాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 418 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారని వివరించారు. ఈనెల 26 నుంచి మే 3 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 80084 03631, 93460 20003 సెల్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.