హనుమకొండ చౌరస్తా, మే 30: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో వాసంతి మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో 483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, ఈ పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠవాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(హనుమకొండ కొత్త బస్ స్టేషన్ రోడ్), ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పెట్రోల్పంపు, కుమార్పల్లి మార్కెట్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని లేదా హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు, పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, పోలీస్ బందోస్తు, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోగల జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్టానిక్ వస్తువులు తీసుకురాకూడదని, ఎలాంటి బెరుకు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని డీఈవో వాసంతి సూచించారు.