స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 16 : కాంగ్రెస్ పాలనలోనే అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయని, నాటి సీఎం వైస్ రాజశేఖర్‌రెడ్డి చర్చల పేరుతో నక్సలైటన్లను ఆహ్వానించి అనేక మందిని హతమార్చారని బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివారెడ్డిపల్లి శివారులో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి వారి కదలికలను, వారి స్థావరాలను తెలుసుకుని ఎన్కౌంటర్లలో అనేక మందిని చంపించారని అన్నారు. దీనికి టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లలో చనిపోయిన వారికి రేవంత్‌రెడ్డి, ఇందిర బాధ్యత వహించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రి గా ఉన్నప్పుడు అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరిగి ఉండవచ్చు తప్ప స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగినట్లు ఆరోపణలు చేయ డం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువకుల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. 2009లో తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంతరం వెనుకడుగు వేయడంతో ఆందోళనకు గురైన అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. సబ్బండవర్గాల ప్రజలు, ఉద్యమ నేత కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇన్ని ఆత్మబలిదానాలు జరిగేవి కావని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి ఊచలు లెక్కపెట్టిన రేవంత్‌రెడ్డిని గతిలేక కాంగ్రెస్ అధిష్ఠానం టీ-పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని శ్రీహరి ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్లను బెదిరిస్తూ డబ్బులు దండుకునే రేవంత్‌రెడ్డి ఉన్నత పదవులకు సరిపోయే వ్యక్తి కాదన్నారు. ఇలాంటి వ్యక్తికి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి పోలీసు కేసులు లేవని, నిజాయితీగా ప్రజలకు సేవలందించిన తనపై కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఇందిరపై రఘునాథపల్లి మండలంలో ఎన్ఆర్ఐకి చెంది న ఓ డాక్టర్‌కు భూమి ఇప్పిస్తానని చెప్పి రూ.4.25 కోట్లు తీసుకుందని ఆరోపించారు. భూమి ఇవ్వకపోవడంతో ఆమెపై కేసు నమోదైందని, ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులను నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో కరెంటు ఉండదని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ నెల 20న జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున్న ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ కందుల రేఖ, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, చేపూరి వినోద్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, సింగపురం జగన్, సర్పంచ్‌లు తాటికొండ సురేశ్‌కుమార్, పోగుల సారంగపాణి, కందుల శ్రీలత, నగరబోయిన మణెమ్మ, ఎంపీటీసీలు గుర్రం రాజు,కనకం స్వరూప, బూర్ల లత, నెలమంచి శైలజా అజయ్‌రెడ్డి, గన్ను నర్సింహులు, వెంకటస్వామి, కూడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, రాపోలు మధుసూదన్‌రెడ్డి, తోట వెంకన్న, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, నాయకులు అక్కనపల్లి బాలరాజు, గట్టు రమేశ్, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, హఫీ జ్, నాయకులు సంపత్‌రాజ్, మ్యాకల శ్రీకాంత్, తెల్లాకుల రామకృష్ణ, ఆకుల నర్సయ్య, హిమబింధు, ఆకారపు అశోక్, మారపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.