కృష్ణకాలనీ, మార్చి 4 : భూపాలపల్లిలోని దళితబంధు రెండో విడుత లబ్ధిదారులు సోమవారం రోడ్డెక్కారు. గ్రౌండింగ్ పూర్తయి కలెక్టర్ ఖాతాలోకి చేరిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర దళితబంధు ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నముండ్ల సంపత్ మహరాజ్ మాట్లాడుతూ దళిత పక్షపాతి అంటూ కపట మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని పూర్తిగా విస్మరించిదన్నారు. గత ప్రభుత్వం రెండో విడుత లబ్ధిదారులను ఎంపిక చేసి కలెక్టర్ ఖాతాలో నిధులు జమచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా దళితులను మోసం చేసిందన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడతామని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ నాయకులు దళితులను ఎందుకు పట్టించుకోవడం లేదో తెలపాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దళితులంటే చిన్నచూపన్నారు.
ఇప్పటికైనా నిధులు విడుదల చేయకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిదారులమంతా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి దళితుల జీవన స్థితిగతులను తెలుసుకొని రెండో విడుత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు రామిళ్ల కిరణ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య, ప్రధాన కార్యదర్శి రేణుకుంట్ల మహేశ్, నాయకులు జక్కయ్య, వెంకటయ్య, లక్ష్మయ్య, రామన్న, రాజబాబు, సమ్మయ్యతో పాటు 100మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.