2009 నవంబర్ 29 మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం అందుకొని ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి యావత్ తెలంగాణను ఉద్యమం వైపు నడిపించిన సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజల ‘ప్రత్యేక’ ఆకాంక్ష నెరవేరాలనే కేసీఆర్ సంకల్పం, అలుపెరుగని పోరాటం, పట్టుదల.. తెలంగాణ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపి రాష్ట్రం సాకారమయ్యేలా చేసింది.
ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ నేడు(శుక్రవారం) ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని చోట్ల జిల్లాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో వేలాది మందితో ర్యాలీలు, అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్, ఉద్యమకారులకు సన్మానాలు, తదితర కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు చేయగా మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
హనుమకొండ, నవంబర్ 28 : ప్రత్యేక రాష్ట్రం కోసం ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో తన ప్రాణాలను సైతం లెక చేయకుండా ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్నే మలుపు తిప్పిందని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. నాటి ఉద్యమస్మృతులను గుర్తుచేసుకుంటూ.. ఉద్యమస్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 10.30 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ, 10.45 గంటలకు అమరులకు నివాళులర్పించడం, 11గంటలకు నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి, బాలసముద్రం ఏకశిల పార్కులో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దీక్షా దివస్‌లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్, వక్తల ఉపన్యాసాలు ఉంటాయని వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దీక్షా దివస్ కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అతిథులుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతారని దాస్యం పేర్కొన్నారు.