వాషింగ్టన్ : యుద్ధం విషయంలో తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, చర్చలు జరుగుతాయో.. లేదో తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు. లేదంటే చావు తప్పదని హెచ్చరించారు. తన ఆఫర్‌ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ స్పందించారు.
అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘ఈ యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు. ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఇజ్రాయెల్ కూడా తన అధికార కాంక్షతో అమెరికా సైనికులను కూడా బలి పెడుతున్నది’ అంటూ అలీ మండిపడ్డారు. కాగా.. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, ఇరానే మొదలు పెట్టిందని అమెరికా సైన్యం తెలిపింది. యుద్ధాన్ని ముగించేది తామేనని పేర్కొన్నది.