హనుమకొండ, డిసెంబర్ 8 : ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, మానవత్వ కోణంలో ఆలోచించి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్ అన్నారు. దీక్షా దివస్ 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండలోని డాక్టర్ అగర్వాల్స్ సహకారంతో మహిళలు, పార్టీ శ్రేణులకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష ప్రాముఖ్యతను నేటి తరానికి, యువతకు తెలిపేందుకే దీక్షా దివస్ పేరిట 11 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ 14 ఏండ్ల పోరాటంతోనే 60 ఏండ్ల స్వరాష్ట్ర కల సాకారమైందని, 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యాయన్నారు. కూల్చివేతలు, ఎగవేతలు, మాట తప్పడాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు 2009 డిసెంబర్ 9న మొదటి అడుగుపడిన సందర్భాన్ని పురసరించుకొని మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నట్లు వినయ్‌భాస్కర్ చెప్పారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, జోరిక రమేశ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు నరెడ్ల శ్రీధర్, నార్లగిరి రమేశ్, నయీమొద్దీన్, సదాంత్, పానుగంటి శ్రీధర్, సల్వాజి రవీందర్రావు, బుద్దె వెంకన్న, కొండపాక రఘు పాల్గొన్నారు.