హనుమకొండ, జూలై 17: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినియ్ భాస్కర్ సూచించారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 58, 59, 60 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలతో పాపులర్ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాసర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సంఘం సర్ ప్రకియను ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఎల్ఏలకు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ నియమించిన బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. పలువురు ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సాయంగా గులాబీ శ్రేణులు పనిచేయాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకున్న ఓటర్లు సంబంధిత బీఎల్వోలకు వివరాలు పూర్తి చేసిన వాటిని తిరిగి ఇచ్చేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవారి, చనిపోయిన వారి ఓట్ల సమాచారాన్ని బీఎల్వోలకు అందించాలని సూచించారు. తప్పులు, అవకతవకలు లేని ఓటర్ లిస్టు తయారీలో కీలకంగా మారే సర్ ప్రక్రియలో బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డివిజన్ల వారీగా ఇప్ప టికే పార్టీ తరపున హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిన నాయకులను అభినందించారు. పార్టీ కార్యాలయం కేంద్రంగా సర్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసి, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు, సమాచారం అవసరం ఉన్నా సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో 58, 59, 60 డివిజన్ల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.