కాజీపేట, అక్టోబర్ 8: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తానని మాయ మాటల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆటోడ్రైవర్లను విస్మరించిందని, బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆటో అడ్డాలో ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం బాకీ కార్డుల పంపిణీ చేపట్టారు. కాంగ్రెస్ బాకీ కార్డుతో పాటు, ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలుకు నోచుకోక పోవడంతో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బాకీ కార్డులను తయారు చేయించి ఆటో డ్రైవర్లకు వినయ్ భాస్కర్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సుతో ఆటోకార్మికుల పొట్టకొట్టిందని మర్శించారు. కాంగ్రెస్ నాయకులను ఎక్కడ పడితే అక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలుగాని హామీల తో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాజ్యాంగంలో పొందు పరిచిన విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల బతుకులను చిందర వందర చేసిందని అన్నారు. అనేక మంది ఆటో కార్మికులు ఆత్మ హత్య చేసుకున్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 47 వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు, ఆటో యూనియన్ నాయకులు గడ్డం నరహరి, మోట్ల నరసింహ, శంకర్ నాయక్, బొక్క స్వామి, రవీందర్, వెంకటేష్ తదితరులు పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.