హనుమకొండ, అక్టోబర్ 7: కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా భయపడమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డితో కలిసి హ నుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చిందని, వీటిపై బాకీ పేరిట కార్డులను ప్రదర్శించామన్నారు. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని విమర్శించారు.
హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేసి ఇబ్బందులుకు గురి చేస్తున్నదన్నా రు. ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు పై అవమానకరంగా మాట్లాడుతున్నారని అన్నా రు. సమైక్య రాష్ట్రంలో జరుగని అభివృద్ధి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. గత కాంగ్రె స్, టీడీపీ హయాంలో వరంగల్‌లోని అజంజాహీ మిల్లును అమ్ముకొన్నారని, దీంతో వేల మంది ఉపాధి కోల్పోయారన్నారు. కాకతీయ టెక్స్టైల్స్, మడికొండలో ఐటీ పార్కు ఏర్పాటు చేసి ఘనత కేసీఆర్, కేటీఆర్లదని అన్నారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించి కిరీటం చేయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనున్న చెరువులోని నీటిని, మట్టిని అమ్ముకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఏ రోజు అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిలదీస్తామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరే టర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు జానకిరాములు, సల్వాజి రవీందర్రావు, రాకేశ్, రామస్వామి, రఘు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దొంగ మాటలు మాట్లాడుతున్నది. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఎస్టిమేట్స్, ప్రతిపాదనలకే పరిమితమయ్యింది తప్ప రైతులకు నీళ్లిచ్చిన పాపాన పోలేదు. 22 నెలల్లో ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఒక పైసా విడుదల చేయలేదు. క్యాబినెట్ ఆమోదమని చెప్పి పేపర్ మీద అంకెల గారడీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశమంతటా అమలు చేసే పథకాలు తెచ్చాం. 22 నెలల్లో సీఎం పదవిని కాపాడుకొనేందుకు రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీని కలవడమే తప్ప ఒక్క పైసా విడుదల చేయలేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయకుంటే వెంటపడుతాం.
– మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
కోర్టు తీర్పు ఎలా వచ్చినా దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ అమలు చేయని పథకాలపై బాకీ కార్డులో తప్పుంటే ఎక్కడైనా చర్చకు సిద్ధమే. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కుంభకోణాలు. వారి పాలనలోనే అనేక స్కాంలు జరిగాయి. కోర్టులను అడ్డుపెట్టుకొని ఎలక్షన్స్‌ను కూడా ఆపాలని చూస్తున్నారు. స్థానిక ఎన్నికలకు గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దొరకడం లేదు. దొంగ లెకలు చేసి దొంగ రిజర్వేషన్ పెట్టి కులం లేని దగ్గర రిజర్వేషన్ ఇచ్చారు. తండాల్లో బీసీలకు, ఎస్టీలు లేని వద్ద వారికి రిజర్వేషన్ ఇచ్చారు. తాము పెట్టిన పథకాల శిలాఫలకాలకు పేర్లు తీసి కలర్స్ వేసి వారి పేర్లు పెట్టుకొనేందుకు సిగ్గుండాలి.
– మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి